ఏపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా..

ఏసీఏ స్టేడియంలో రెండు ఆసక్తికర పోరులు..

మధ్యాహ్నం విజయవాడ–అమరావతి రాయల్స్..

రాత్రి భీమవరం–కాకినాడ కింగ్స్ సమరం

ప్లేఆఫ్ రేసు దృష్ట్యా ఇరు మ్యాచ్‌లకు ప్రాధాన్యం

రోజురోజుకూ పెరుగుతున్న అభిమానుల సందడి..

స్టేడియానికి భారీగా తరలివస్తున్న క్రికెట్ ప్రేమికులు..

(ఆంధ్రప్రభ, విజయవాడ): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్-5లో మూడో రోజు నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ హెడర్ వినోదం అందనుంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.

తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ జట్టు క్యాపిటల్ అమరావతి రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. వరుస విజయాలతో జోరుమీదున్న విజయవాడ సన్‌షైనర్స్ తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా, అమరావతి రాయల్స్ గెలుపుతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.

రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్ జట్లు రాత్రి 7 గంటలకు తలపడనున్నాయి. ఇరు జట్లూ కీలక పాయింట్ల కోసం పోటీపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

పెరుగుతున్న ప్రేక్షకులు…

ఏపీఎల్‌కు రోజురోజుకూ అభిమానుల ఆదరణ పెరుగుతోంది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది. ఉత్కంఠభరిత పోరాటాలను వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు క్యూ కడుతున్నారు.