Amanagallu వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి

Amanagallu వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి

  • ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఆమనగల్లు (Amanagallu), ఆంధ్రప్రభ: రానున్న వానాకాలం సాగు సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వానాకాలం సాగు ప్రారంభానికి ముందే రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా నిల్వలు ఏర్పాటు చేసి, పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సూచించారు.

నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందేలా చూడాలని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదేశించారు. సాగుకు సంబంధించిన సాంకేతిక సూచనలు, పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, పురుగుమందుల వాడకం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శోభారాణి, శ్రీనివాస్ గౌడ్, అరుణ, అనిత, రేణుకా చక్రవర్తి పాల్గొన్నారు.