ఇంద్రకీలాద్రిపై భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రిపై భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లు
క్షేత్రస్థాయిలో సీపీ ప్రత్యేక పరిశీలన
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రాక రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కొండపై ప్రధాన ఆలయం, పరిసర ప్రాంతాలు, ఘాట్ రోడ్డుతో పాటు పలు కీలక ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన మహా కుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కొండపై వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు చేరుతున్న పరిస్థితిపై ప్రశ్నించిన హోం మంత్రి, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ సమస్యను ప్రస్తావిస్తూ అధికారులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. సుమారు పది నిమిషాల పాటు పోలీసు, అధికారులతో చర్చిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీపీ రాజశేఖర్ బాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంద్రకీలాద్రి కొండపై పలు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్‌కు అనుకూలమైన ప్రదేశాలను పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యటన సందర్భంగా అదనపు డీసీపీలు, ఏసీపీలు, వన్‌టౌన్ సీఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం ఈవో పార్కింగ్‌కు సంబంధించిన అవసరాలు, ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను సీపీకి వివరించారు.
అనంతరం దేవస్థానం అధికారులతో సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష చేశారు. పరిశీలన అనంతరం రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
