TG | బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే – హ‌రీశ్ రావు

సిద్దిపేట – తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్నదని చెప్పారు. నాడు సిద్దిపేట నుంచే కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని గుర్తుచేశారు.

సిద్దిపేట పట్టణం రంగాధంపల్లి అమరవీరుల స్థూపం వద్ద చలో వరంగల్ సభకు వెళ్లే విద్యార్థి, యువత పాదయాత్రను హరీష్‌రావు నేడు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. వెయ్యి మంది విద్యార్థి, యువతతో కలిసి హరీశ్ రావు పాదయాత్ర మొదలుపెట్టారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు అని నినాదాలు చేశారు. ఈ రోజు మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరినటువంటి విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని అన్నారు.

బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమేనని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని ఉద్ఘాటించారు. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలో ప్రజలతోనే ఉన్నామని చెప్పారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత పాదయాత్ర ప్రారంభించిందని అన్నారు. పురిటిగడ్డ సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శన చేశామని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజల విజయోత్సవమని అభివర్ణించారు. కాంగ్రెస్ 420 దుర్మార్గపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామదండు కదిలిందని చెప్పారు. నేడు మన రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందని అన్నారు. రేవంత్ పాలనను అంతమొందించడానికి ఈ పాదయాత్ర తమకు విజయయాత్రగా మారనుందని తెలిపారు. కాంగ్రెస్ పాలన ప్రజాకంటక పాలనగా మారిందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్‌రావు ఆరోపణలు చేశారు.

తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినావభావ సంబంధం…

44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది 27వ తేదీన వరంగల్‌లో జరుగబోయే పార్టీ రజతోత్సవ సభ కోసం స్వచ్ఛందంగా తరలివచ్చినందుకు హరీశ్‌ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినావభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సందర్భమైన సిద్దిపేటకు పేగు బంధం ఉందని గుర్తుచేశారు. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి కదిలిందని అన్నారు.

కాంగ్రెస్ అరాచకాలను వివరించాలి…

ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి అందరూ క్రమశిక్షణతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా నడవాలని హరీశ్‌ రావు సూచించారు. ఎవరికి చిన్న ప్రమాదం, గాయమైనా తన గుండె బాధపడుతుందని.. కాబట్టి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటానని అన్నారు. గ్రామాలు, మండలాలు, పట్నాల వారీగా టీములు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. మీకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని అన్నారు. కంటికి రెప్పలా చూసుకునేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిమ్మల్ని పర్యవేక్షిస్తారని తెలిపారు.

Leave a Reply