ఆదిలాబాద్‌లో 200పైగా టేలాలు, దుకాణాల ఖాళీ
కలెక్టర్ ఆదేశాలతో ఎస్పీ ఆపరేషన్ సక్సెస్
ఆందోళనకారుల అరెస్టు
ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 20 ఏళ్లుగా రోడ్లపైనే తిష్ట వేసి వ్యాపారాలు సాగిస్తున్న కబ్జాదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇంతకాలం రాజకీయ నేతల అండదండలతో గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌక్ , శివాజీ చౌక్, సినిమా రోడ్డు, ఇతర ప్రధాన వీధులను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న టేలాలు, షెడ్లు, తోపుడు బండ్లను మంగళవారం జేసీబీలతో తొలగించారు. మున్సిపల్ నాలాలపై కబ్జా చేసిన దుకాణాలను సైతం తొలగించి ట్రాఫిక్ సమస్యను పోలీసులు నివారించారు. తొలగించిన వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా పాత గణేష్ థియేటర్ మున్సిపల్ ఖాళీ స్థలాన్ని కేటాయించగా, ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండానే…
ఇరుకైన రోడ్లపై ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలుమార్లు మున్సిపల్ అధికారులు, పోలీసులు హెచ్చరించినా కబ్జా రాయుళ్లు మాత్రం రాజకీయ నేతల అండదండలతో వ్యాపారం సాగించారు. దీంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కలెక్టర్ అనుమతి మేరకు భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దించి సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా అడుగడుగున వెలసిన అక్రమ దుకాణాలు, షెడ్లు, తోపుడు బండ్లను పోలీసుల బందోబస్తుతో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలకు చెందిన 20 మంది నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షెడ్ల తొలగింపు సందర్భంగా కొందరు అడ్డుకొని నిరసన తెలపడంతో వారిని అరెస్ట్ చేశారు. ఖాళీ అయిన వీధి వ్యాపారులను మధ్యాహ్నం వరకు ప్రత్యామ్నాయంగా గణేష్ థియేటర్ లీజు స్థలంలోకి పంపించారు. ఆక్రమణల తొలగింపుతో పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పి కాజల్, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఆర్డిఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, సుమారు 800 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.