26thaprilchintana | జీవన మార్గదర్శకం

26thaprilchintana | జీవన మార్గదర్శకం
26thaprilchintana | కర్తవ్య భావన మరియు బాధ్యత
నీచాశ్రయం vs మహదాశ్రయం
వ్యక్తిత్వంపై సత్సంగత్యం ప్రభావం
భౌతిక, పారలౌకిక జీవిత సమతుల్యత
ధర్మమార్గం మరియు జీవన విలువలు
మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
26thaprilchintana | నీచాశ్రయో న కర్తవ్యః
కర్తవ్యో మహదాశ్రయః
ఈశాశ్రయో మహానాగః
పప్రచ్ఛ గరుడం సుఖమ్!
కర్తవ్యం అంటే బాధ్యతగా నిర్వహించవలసిన పని. అందులో జవాబుదారీతనం ఉంటుంది. సమర్థత, నిబద్ధత, నిలకడ ఉంటాయి. పరస్పరాధారిత సమాజంలో అన్ని పనులను తామొక్కరే నిర్వహించుకోవడం సాధ్యపడకపోవచ్చు. మరొకరిని ఆశ్రయించడం లేదా ఇతరుల సహాయ సహకారాలను కోరడం అవసరం. అయితే ఆపత్సమయంలో ఎవరి సహాయాన్ని కోరాలి లేదా ఎవరిని ఆశ్రయించాలో చెప్పుతుంది ఈ సుభాషితం.
నీచులు లేదా సహాయాన్ని పొంది అవసరమైన సమయంలో ప్రక్కకు తప్పుకునే స్వార్థపరులు, కపటవేషధారులు, అహంకారులు, సమయస్ఫూర్తి లేనివారు, ఇతరులకు అపకారం చేసే స్వభావం కలిగిన వారిని ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు; సరికదా కార్యభంగం జరుగుతుంది. మనలను నష్టపరుస్తారు. అందుకే గొప్పవారిని ఆశ్రయించాలని చెప్తున్నాడు సుభాషిత కర్త.
దానికి ఉదాహరణగా—కైలాస శిఖరంపై ఒకనాడు శంకరుడు ధరించే మహాసర్పం వాసుకి తిరుగుతున్నది. ఆ సమయంలో ఆకాశంలో గరుత్మంతుడు విహరిస్తున్నాడు. సాధారణంగా పాములు గరుత్మంతుని చూస్తే పారిపోతాయి. కానీ వాసుకి మాత్రం గరుత్మంతుని అతిథిగా సంభావించి యోగక్షేమాలను ప్రశ్నించాడట. అంతటి ధైర్యం, విజ్ఞత, సమయస్ఫూర్తి, స్థైర్యం వాసుకికి ఎలా వచ్చింది అంటే—గొప్పవాడైన ఈశ్వరుని ఆశ్రయించడం వల్లనే అనేది విదితమే.
మురికి కాలువల నుండి వీచే గాలి దుర్గంధాన్ని మోసుకొస్తుంది. గంధపు చెట్లపై నుండి వీచే గాలి సుగంధాన్ని మోసుకొస్తుంది. గాలి ఒకటే; కాకపోతే అది ఆశ్రయించిన వాతావరణం విభిన్నమైనది. తల్లిదండ్రుల పెంపకం, స్నేహితుల ప్రభావం, చుట్టూ ఉండే వాతావరణం వ్యక్తుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. తదనుగుణమైన భావనలకు వ్యక్తి లోనవుతాడు. లక్ష్యం ఒకటే కావచ్చు, కానీ ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎవరి ప్రభావానికి, ప్రేరణకు లోనవుతున్నామనేదే అంతిమ ఫలితపు ఉత్తమత్వాన్ని నిర్ణయిస్తుంది.
భౌతిక జీవితం, పారలౌకిక జీవితం రెండిటినీ సమన్వయం చేసుకుంటూ వ్యక్తి ప్రస్థానం జరగాలి. భౌతిక జీవితం సార్థకమైన అభ్యుదయాన్ని ఇస్తుంది; దానిని భద్ర జీవితం అంటాము. పారలౌకిక జీవితం జనన మరణ చక్ర బంధనాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది; దానిని భవ్య జీవితం అంటాము. రెంటినీ ‘శ్రీ’, ‘కైవల్యము’ అనే పదాలతో సూచించిన పోతనగారు తన భాగవతాన్ని రచించి భద్ర జీవితాన్ని, భవ్య జీవితాన్ని ప్రసాదించగలిగిన పరమేశ్వరుని ఆశ్రయించాడు. ఆనందంతో కూడిన అభ్యుదయాన్ని పొందాడు.

“అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి, కర్తవ్యం ఏవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి” అన్నారు. ప్రాణాలున్నా, పోతున్నా చేయవలసిన బాధ్యతను ధర్మమార్గంలో నిర్వహించాలి. అలాగే ఆచరించకూడని పనులను ప్రాణాలు పోతున్నా ఆచరించకూడదు. ప్రజల మధ్య ఉద్రిక్తతలను పెంచుతూ మానవ హననానికి సిద్ధపడే ఉగ్రవాదుల సాంగత్యం రాక్షసత్వాన్ని ప్రసాదిస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సమష్టి ప్రయోజనాలు మిన్న. దేశం కోసం, ధర్మం కోసం అవసరమైన త్యాగాలకు సిద్ధపడడమే ఉత్తమ పౌరుల లక్షణం. సేవాభావన కలిగిన అలాంటి వారి సాంగత్యం ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి మానసిక స్థితిని పొందేందుకు సత్సాంగత్యం అవసరం.
నిజానికి సందిగ్ధత హేయత్వంగా చెప్పబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో సంశయాత్ముడై, కింకర్తవ్య విమూఢచిత్తుడైన అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. కృష్ణుని కర్తవ్యబోధ అర్జునుడిని సత్పథంలో నడిపింది; ధర్మస్థాపన జరిగింది. కృష్ణుడు యుద్ధం చేయమని గానీ చేయవద్దని గానీ చెప్పలేదు; “యథేచ్ఛసి తథా కురు” అన్నాడు. దుర్యోధనుడు శకుని, దుశ్శాసనాదులను ఆశ్రయించి యుద్ధాన్ని ఆహ్వానించాడు. అధర్మమార్గంలో నడిచాడు. ఫలితంగా సబాంధవంగా ఆహవభూమిలో హతుడయ్యాడు. ధర్మరాజు యుద్ధానంతరం కృష్ణుని సలహామేరకు భీష్ముని ఆశ్రయించి రాజ్యపాలనలోని సూక్ష్మాంశాలను తెలుసుకున్నాడు. ఉత్తమ పాలకునిగా నిలిచిపోయాడు. కర్ణుడు స్వతహాగా ఉత్తముడే అయినా, తాను ఆశ్రయించిన దుర్యోధనాదుల వల్ల అధర్మపరునిగా ముద్రపడ్డాడు. అనివార్యమైన మరణం సంభవించుటకు ముందు భౌతిక ఐశ్వర్యం వెంట పరుగులు తీస్తూ నిస్సారంగా బ్రతకడం కన్నా, భగవంతుని ఆశ్రయిస్తూ పదుగురికి సాయపడుతూ ఉత్తమ జీవితాన్ని నిర్వహించుకోవడం ప్రయోజనకరం.
- పాలకుర్తి రామమూర్తి
