Guess the Guests of This Season | కేరళలో తొలకరి జల్లులు.. తెలంగాణలో కిల‌కిల రాగాలు..

Guess the Guests of This Season | కేరళలో తొలకరి జల్లులు.. తెలంగాణలో కిల‌కిల రాగాలు..

ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కేరళ తీర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని తొలక‌రి జ‌ల్లులు కురుస్తున్నాయి. అలాగే, ఈ ఏడాది రుతుపవనాలు అనుకూల పరిస్థితుల్లోనే దేశంలోకి ప్రవేశిస్తున్నాయని వాతావ‌ర‌ణ‌ నిపుణులు చెబుతున్నారు.

నైరుతి రుతుపవనాలు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది భానుడు కురిపించిన అగ్నిధారలకు తెలంగాణ నేల విలవిలలాడింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఎండిపోయిన చెరువులు, అడవుల్లో నీటి చుక్క లేక వన్యప్రాణులతో పాటు పక్షులూ అల్లాడిపోయాయి. చిన్న చిన్న పిట్టలు, గువ్వలు సైతం నీడ దొరక్క, గొంతు ఎండిపోయి అల్లాడిన దృశ్యాలు మనల్ని చలింపజేశాయి.

కానీ, జూన్ రాకతో ప్రకృతి రూపురేఖలు మారుతున్నాయి. రుతుపవనాల మొద‌లై ఆకాశం మేఘావృతమై, తొలి చినుకులు నేలను తాకుతుంటే కేవలం మనుషులకే కాదు, ప్రకృతికి కూడా ప‌ర‌వ‌శించిపోతుంది. ఎండలకు అలిసిపోయిన జీవకోటికంతటికీ కొత్త ప్రాణం వస్తుంది.

అయితే, సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ ఆకాశంలో ఒక అద్భుతమైన కోలాహలం మొదలవుతుంది. శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షుల గురించి మనకు తెలుసు, కానీ ఈ చల్లటి వాతావరణాన్ని కోసమే ఖండాలు దాటి తెలంగాణ అడవులకు, చెరువులకు తరలివచ్చే విశిష్ట అతిథుల గురించి మీకు తెలుసా?

ఆఫ్రికా నుండి వానను మోసుకొచ్చే ‘కోకిల’ (Pied Cuckoo)

ఎండల తీవ్రతకు అల్లాడిన తెలంగాణ నేలపైకి వానదేవుడి కంటే ముందే వచ్చే ప్రకృతి దూత ఈ పక్షి. ఆఫ్రికా ఖండం నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి, హోరుమనే అరేబియా సముద్రాన్ని దాటి ఈ విదేశీ అతిథి కచ్చితంగా రుతుపవనాలకు కొద్ది రోజుల ముందే మన తెలంగాణకు చేరుకుంటుంది. ఆధునిక సైన్స్ ప్రకారం దీనిని ‘జాకోబిన్ కోకిల’ అని పిలుస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ పక్షి కనిపిస్తే ఇక వానలు పడతాయి, భూమి చల్లబడుతుంది అని రైతులు నమ్ముతారు. అయితే ఈ ప‌క్షులు సొంతంగా గూళ్లు కట్టుకోవు. ఇక్కడికి వచ్చాక కాకులు లేదా బుల్‌బుల్ పిట్టల గూళ్లలో తమ గుడ్లను పెట్టి, పిల్లల్ని చేసి వర్షాకాలం ముగిశాక మళ్లీ తిరుగుపయనం అవుతాయి.

అడవికి దొరికిన జీవంత ఇంద్రధనస్సు.. ‘నవరంగ్’ (Indian Pitta)

జూన్ నెల వచ్చిందంటే తెలంగాణ అడవుల్లో, ముఖ్యంగా వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు లేదా ఆదిలాబాద్‌లోని క‌ల్వాల్ టైగర్ రిజర్వ్ పరిసరాల్లో ఒక అద్భుతమైన పక్షి సందడి మొదలవుతుంది. అదే ‘ఇండియన్ పిట్ట’.. దీనిని ‘నవరంగ్’ అని కూడా పిలుస్తారు. దీని శరీరంలో తొమ్మిది రంగులు కలగలిసి ఉండి, చూసేందుకు ఒక జీవంత ఇంద్రధనస్సులా కనిపిస్తుంది.

దక్షిణ భారతదేశం, శ్రీలంక నుండి ప్రయాణించి జూన్ మొదటి వారంలో ఇవి తెలంగాణకు చేరుకుంటాయి. వేసవిలో ఎండిపోయిన అడవులు ఇప్పుడు చినుకులతో పచ్చబడుతుండటంతో, భూమిలోంచి వచ్చే కీటకాలు, వానపాములు వీటికి లభిస్తాయి. తెల్లవారుజామున ఇవి చేసే రెండు స్వరాల కూత అడవికి కొత్త అందాన్ని ఇస్తుంది. అంతే కాకుండ‌, తీవ్రమైన వేసవి ఎండల వల్ల చాలా కాలం పాటు సైలెంట్‌గా ఉండిపోయిన స్థానిక పక్షులు (Resident Birds) కూడా ఈ జూన్ చల్లదనానికి ఒక్కసారిగా చురుగ్గా మారుతాయి.

పక్షి ప్రేమికులకు ఒక చిన్న గమనిక..

ఎండల తీవ్రతను తట్టుకుని, వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి కొత్త ఆశ్రయం కోసం చేరుకున్న ఈ చిన్నారి అతిథి పక్షుల సందడి చూడాలనుకుంటున్నారా? అయితే తెల్లవారుజామునే హైదరాబాద్ శివార్లలోని Ameenpur Lake, Osman Sagar (గండిపేట) లేదా Ananthagiri Hills వైపు అడుగులు వేయండి. ప్రకృతి కొత్త రంగులు దాల్చుతున్న ఈ వేళ, పక్షుల జీవన పోరాటం, వాటి ఉల్లాసం, గుంపులుగా ఎగిరే అద్భుత దృశ్యాలు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతితో మమేకమవుతూ వాటి ప్రపంచాన్ని దగ్గరగా వీక్షించడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.

Leave a Reply