పశు సంపదతో గ్రామాల్లో సుస్థిర సంపద
పశు సంపదతో గ్రామాల్లో సుస్థిర సంపద
అన్నదాతలకు అదనపు ఆదాయానికి వీలు
పాడి పశువుల్లో పునరుత్పత్తిపై ప్రత్యేక దృష్టి
పశువుల ఉత్పాదకత పెంపునకు కార్యాచరణ
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పశుసంపద కీలకమని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థిరమైన పాల ఉత్పత్తి ద్వారా రైతుల ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు పశు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ విధానంపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి విలేజ్ హెర్డ్ ఫెర్టిలిటీ రిజిస్టర్ (వీహెచ్ఎఫ్ఆర్)ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువుల్లో సకాలంలో చూలు కట్టించకపోవడం వల్ల రైతులు గణనీయంగా నష్టపోతున్నారని.. అందువల్ల ప్రతి పాడి పశువును దాని పునరుత్పత్తి, ఉత్పత్తి జీవిత చక్రాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ సకాలంలో చూలు కట్టించడం, క్రమబద్ధమైన ఈతలు, అధిక పాల ఉత్పత్తి, మెరుగైన పశు ఉత్పాదకతను సాధించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సకాలంలో ఈనే పశువుల వల్ల అధిక పాల దిగుబడి ఉంటుందని.. సకాలంలో చూలు కట్టించడం వల్ల అనుత్పాదక దినాలు తగ్గి రైతులకు అధిక ఆర్థిక లాభం కలుగుతుందన్నారు. అదేవిధంగా లింగ నిర్ధారిత వీర్యం వినియోగం వల్ల ఎక్కువ ఆడ దూడలు పుట్టి పాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
కృత్రిమ గర్భధారణ, గర్భ నిర్ధారణ, వంధ్యత్వ నివారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి నిర్వహణ చర్యలు పశువుల ఉత్పాదకత పెంపులో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో పశు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందని.. దీన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. ఎం.హనుమంతరావు, ఉపసంచాలకులు డా. కె.చంద్రశేఖర రావు, డా. మోజెస్ వెస్లీ, డా. ఎస్.నాగభూషణరావు, ఏడీ డా. సునంద, పశు వైద్యులు డా. మనోజ్, డా. పంకజ్, డా. చంద్రశేఖర్ నాయక్ పాల్గొన్నారు
