ACB Raid Money Rules | ఏసీబీ దాడుల్లో పట్టుబడిన కోట్ల రూపాయల నగదు ఏమవుతుంది?
ACB Raid Money Rules | ఏసీబీ దాడుల్లో పట్టుబడిన కోట్ల రూపాయల నగదు ఏమవుతుంది?
ACB Raid Money Rules | సీజ్ నుంచి కోర్టు తీర్పు వరకు పూర్తి ప్రక్రియ ఇదే..!
సోదాల్లో నగదు దొరికిన వెంటనే అధికారులు ఏం చేస్తారు?
కోర్టు తీర్పు తర్వాత అక్రమ ఆస్తులు ఎవరి సొత్తవుతాయి?
ACB Raid Money Rules | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏసీబీ అధికారులు, లేదా ఇతర దర్యాప్తు సంస్థలు నిర్వహించే దాడుల్లో కోటాను కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకుంటారు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెండ్ కొమ్మూరి మల్లారెడ్డి మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సోదాల్లో లెక్కచెప్పని సుమారు రూ.3 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16న ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా పడక గదిలో ఏకంగా రూ.1.10 కోట్ల నగదు లభ్యమయింది. నగదుతో పాటు బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు, ఖరీదైన ప్లాట్ల పత్రాలను అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించినప్పుడు తరచూ కోట్ల రూపాయల నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, లాకర్లు బయటపడుతుంటాయి. సోదాల్లో పట్టుబడిన ఆ డబ్బు తర్వాత ఏమవుతుంది? ప్రభుత్వం దానిని వెంటనే స్వాధీనం చేసుకుంటుందా? లేక తిరిగి యజమానికి ఇస్తుందా? వీటంన్నింటికీ సమాధానాలు చూద్దాం..
అసలు ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం..
సోదాల సమయంలో అధికారులు ముందుగా నగదు, బంగారం, విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలను గుర్తిస్తారు. వాటికి సంబంధించిన పంచనామా (మహజర్) తయారు చేసి, స్వాధీనం చేసుకున్న ప్రతి వస్తువు వివరాలను నమోదు చేస్తారు. అనంతరం వాటిని సీజ్ చేసి అధికారిక కస్టడీలోకి తీసుకుంటారు. దాడుల్లో బయటపడిన నగదు అక్రమ సంపాదనకు సంబంధించినదేనా లేదా చట్టబద్ధ ఆదాయంతో కూడుకున్నదా అన్నది వెంటనే తేలిపోదు. అందుకే ఏసీబీ అధికారులు సంబంధిత అధికారి ఆదాయ వనరులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తారు. దీనిని “డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ (DA) ఇన్వెస్టిగేషన్” అంటారు.
ఈ విచారణలో అధికారి చట్టబద్ధ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేలితే అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తారు. సీజ్ చేసిన నగదు, బంగారం, పత్రాలను కేసులో కీలక ఆధారాలుగా కోర్టుకు సమర్పిస్తారు.
స్వాధీనం చేసుకున్న నగదును సాధారణంగా ప్రభుత్వ ఖజానా లేదా అధీకృత బ్యాంకు ఖాతాల్లో భద్రపరుస్తారు. బంగారం, ఆభరణాలు వంటి విలువైన వస్తువులను కోర్టు ఆదేశాల మేరకు సురక్షిత లాకర్లలో ఉంచుతారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు వాటిపై యజమానికి ప్రత్యక్ష హక్కులు ఉండవు.
కేసు విచారణ అనంతరం ప్రత్యేక ఏసీబీ కోర్టు లేదా అవినీతి కేసులను విచారించే న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. అధికారి నిర్దోషిగా తేలితే సీజ్ చేసిన నగదు, వస్తువులను తిరిగి అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే అవి అక్రమ సంపాదనగా కోర్టు నిర్ధారిస్తే ప్రభుత్వం వాటిని జప్తు చేస్తుంది.
జప్తు చేసిన నగదు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆస్తులు, భూములు, భవనాలు ఉంటే సంబంధిత చట్టాల ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.
అయితే సోదాల్లో దొరికిన ప్రతి రూపాయి ప్రభుత్వానికి వెళ్లిపోదు. దర్యాప్తు, కోర్టు విచారణ, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఏసీబీ దాడుల్లో బయటపడే కోట్ల రూపాయల నగదు వెంటనే ప్రభుత్వ సొమ్ముగా మారదు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో దర్యాప్తు, విచారణ, అప్పీలు వంటి ప్రక్రియలు పూర్తవడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అందువల్ల సీజ్ చేసిన నగదు, ఆస్తులు చాలాకాలం పాటు కోర్టు పర్యవేక్షణలోనే ఉంటాయి.
అక్రమ డబ్బుపై తుది నిర్ణయం ఎవరిది?
అవినీతి నిరోధక శాఖ లేదా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉన్నా, అది అక్రమ సంపాదన అని తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం కోర్టుకే ఉంటుంది. కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఆ డబ్బు తిరిగి యజమానికి వెళ్తుందా లేదా ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుందా అన్నది ఖరారవుతుంది.
