టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం.. కొవ్వూరువాండ్లపల్లిలో విషాదం
టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం.. కొవ్వూరువాండ్లపల్లిలో విషాదం
అగ్రహారంపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
విష్ణు కుమార్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం
శ్రీ సత్యసాయి, (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పులిగుండ్లపల్లి పంచాయతీ పరిధిలోని అగ్రహారంపల్లి సమీపంలో టిప్పర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. తలుపుల మండలం కొవ్వూరువాండ్లపల్లికి చెందిన గణేష్ కుమారుడు విష్ణు కుమార్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విష్ణు కుమార్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విష్ణు కుమార్ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యువకుడి అకాల మరణంతో కొవ్వూరువాండ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
