ఖాకీకి కళంకం..

ఖాకీకి కళంకం..
కర్నూలు ట్రాఫిక్ ఎస్సైపై వేటు.
ఖాకీ ముసుగులో కీచకుడు
సెల్ఫీ వీడియోతో బయటపడ్డ దౌర్జన్యం..
మహిళల ఫోటోలతో బెదిరింపులు
చివరకు సర్వీసు నుంచి బహిష్కరణ.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు… ఖాకీ వేషాన్ని అడ్డంగా పెట్టుకొని అకృత్యాలకు పాల్పడిన కర్నూలు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్సై హరిప్రసాద్ పై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, వేధింపులు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు వంటి తీవ్ర ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయి ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. విధులు నిర్వహించిన ప్రతి చోటా వివాదాలతోనే గుర్తింపు పొందిన ఆయన పై గతంలోనూ అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పని చేసిన సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను డబ్బుల కోసం తీవ్రంగా వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేధింపులను తట్టుకోలేక ఆ డ్రైవర్ ఆత్మహత్యయత్నం పాల్పడగా, ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదన వ్యక్తం చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆ ఘటన అనంతరం హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఆయనకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వివాదాలు కొనసాగినట్టే అయ్యాయి. తాజాగా కొంత మంది మహిళల ఫోటోలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం పోలీస్ శాఖను ఉలిక్కిపడేలా చేసింది. మహిళలను మానసికంగా వేధించడం, అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ఒత్తిళ్లు తేవడం వంటి ఫిర్యాదులతో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

దీనిపై లోతైన విచారణ చేపట్టిన అధికారులకు ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నట్లు తేలినట్లు తెలిసింది. దీంతో శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన హరిప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకుంటూ డీఐజీ డాక్టర్ కోయి ప్రవీణ్ డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో మరోసారి సంచలనంగా మారింది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన కొందరు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే శాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
