Chandra Babu | పేద కుటుంబాల కోసం..

Chandra Babu | పేద కుటుంబాల కోసం..
Chandra Babu, తిరువూరు, ఆంధ్రప్రభ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల ఆరోగ్య సమస్యల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరంగా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.
ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గంలో మొత్తం 21 విడతలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరగ్గా, గురువారం నాటికి 21వ విడతగా 50 మంది లబ్ధిదారులకు 25,23,860 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఇది వరకు నియోజకవర్గంలో 760 మంది లబ్ధిదారులకు 4,18,61,799 రూపాయలు, అలాగే లేఖా ఆధారిత సిఫారసుల ద్వారా 101 మందికి 1,10,07,800 రూపాయలు అందించగా, మొత్తం 5,28,69,599 రూపాయల (5.28 కోట్ల) సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందినట్లు వివరించారు.
ఇంత పెద్ద మొత్తంలో తిరువూరు నియోజకవర్గానికి ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులు, గ్రామాల్లో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులు, కార్యకర్తలు గుర్తించి, బాధితులను తిరువూరు నియోజకవర్గ కార్యాలయానికి తీసుకువచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలా సమిష్టిగా పని చేయాలని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు ఆయన సూచించారు.
