Narayanpet | ఆకాశమే హద్దు… అవకాశాన్ని వదలొద్దు..

Narayanpet | ఆకాశమే హద్దు… అవకాశాన్ని వదలొద్దు..

  • సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన డీఎస్పీ నల్లపు లింగయ్య

Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కప్ 2025–26 క్రీడా పోటీలు సందర్భంగా ఈ రోజు ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డితో కలిసి డీఎస్పీ జ్యోతి వెలిగించి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, చదువుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.సీఎం కప్ టార్చ్ ర్యాలీ మినీ స్టేడియం నుంచి ప్రారంభమై సత్యనారాయణ చౌరస్తా, పాత బస్టాండ్ సెంటర్ చౌక్ మీదుగా దామరగిద్ద వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేష్ శెట్టి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పీడీ గొడుగు నర్సిములు, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, అనంత్ సేన, బాల్‌రాజ్, రమణ, రత్నయ్య, అక్తర్ పాషా, మైనార్టీ గురుకుల కళాశాల, బీసీ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు, స్థానిక క్రికెట్ అకాడమీ క్రికెటర్లు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply