Electricity Bills | పేదల మేలు కోసం..

Electricity Bills | పేదల మేలు కోసం..
- విద్యుత్ చార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు
Electricity Bills | ఆంధ్రప్రభ కృష్ణా బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకొళ్ల నారాయణరావు, జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ అన్నారు. ఈ రోజు మచిలీపట్నంలో వారు మాట్లాడుతూ 2019–2024 కాలానికి సంబంధించిన రూ.4,498 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వం భరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో గృహ వినియోగదారులపై అదనపు విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రూ-డౌన్ అమలుతో విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు 13 పైసలు తగ్గించారన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆర్థికంగా స్థిరీకరించే దిశగా సంస్కరణలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.3.50 నుంచి రూ.1.50కి తగ్గింపు ఈ తగ్గింపుతో ఆక్వా సాగుపై ఆధారపడే రైతులకు ఖర్చు గణనీయంగా తగ్గించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తూ వ్యయ నియంత్రణ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర సగటున రూ.4.70కి పరిమితం అయిందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ సౌకర్యం కల్పిస్తునట్టు తెలిపారు. బీసీ కుటుంబాలకు కేంద్ర సబ్సిడీతో పాటు అదనంగా రూ.20 వేల రాష్ట్ర సబ్సిడీ తక్కువ ధరలకు విద్యుత్ లభ్యతతో భవిష్యత్‌లో చార్జీల స్థిరత్వానికి అవకాశం ఉందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబుప్రసాద్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, వార్డ్ ఇన్‌చార్జిలు, టీడీపీ మహిళా నేతలు, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
