Srisailam | ఘనంగా ఆరుద్రోత్సవం..

Srisailam | ఘనంగా ఆరుద్రోత్సవం..
Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారని కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీస్వామివార్లకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చేపట్టారు. శనివారం వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఉత్తర ద్వార దర్శనం, కలిగించారు. ఉత్సవంలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, గ్రామోత్సవం కార్యక్రమాలు చేపట్టారు. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు. ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా జరిపించబడుతోందన్నారు.

శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించాం అన్నారు. తెల్లవారుజామున శ్రీ స్వామివార్ల ప్రాత:కాల పూజల అనంతరం ఉత్సవంలో భాగంగానే నందివాహన సేవ, స్వామివార్ల ఉరేగింపు జరిపించారు. ఉత్సవం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిపూజ జరిపించారు. తర్వాత లోక కల్యాణం కోసం నిర్వహించబడే ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికి సుఖసంతోషాలు కలగాలని, సంకల్పం చేసామని కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
అనంతరం మహన్యాసాన్ని జరిపిశ్రీ స్వామివారికి లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం జరిపించబడిందన్నారు. పంచామృతాలతోనూ, పలు ఫలరసాలతోనూ, ఆలయప్రాంగణంలోని మల్లికాగుండ పుణ్యజలంతోనూ ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించామని… స్వామివారికి అన్నాభిషేకం జరిపించామని చెప్పారు. అనంతరం పలు రకాల పుష్పాలతో, బిల్వదళాలతో స్వామివారికి విశేషపూజలు చేశారు. ప్రాత:కాల పూజలను జరిపించిన అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు జరిపించారు.

ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలి వెళ్ళే స్వామి అమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున, శివముక్కోటి రోజున వార్షిక ఆరుద్రోత్సవం రోజున ఈ విధంగా శ్రీస్వామిఅమ్మవార్లు ఆలయ ఉత్తరద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలి వెళ్తారన్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరిగిందన్నారు.
స్వర్ణరథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు..
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథారూఢులైన శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయన్నారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా కార్యక్రమములో పలు కళా బృందాల కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం మొదలైన కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.
