KTR | రాబందుల పాలనలో పాలమూరుకు అన్యాయం..

KTR | రాబందుల పాలనలో పాలమూరుకు అన్యాయం..
- తిట్ల పురాణం ఆపి హామీలు అమలు చెయ్
- సీఎంకు కేటీఆర్ కౌంటర్.
- గ్రామ కథానాయకులుగా సర్పంచులు..
- 2028లో కేసీఆర్ మళ్ళీ సీఎం!
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ పాలన రాబందుల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్‌ను దూషించడమే ముఖ్యమంత్రి పని అయిందని మండిపడ్డారు.
తన స్వంత జిల్లా అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటివరకు 10 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పార్టీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించారు.
పాలమూరుపై పగ.. ఎత్తిపోతలపై నిర్లక్ష్యం
ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుత కాంగ్రెస్ పాలన రాబందుల పాలనగా ఉందని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు జిల్లాపై పగ ఉందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన సొంత జిల్లాకు చెందిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని కేటీఆర్ నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలోనే రూ. 28 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయలేక ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కాలువల పనులు చేయకుండా, ఉన్న టెండర్లను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పు కోసం మన నీళ్ల విషయంలో రాజీ పడుతున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
ముఖ్యమంత్రికి పరిపాలన కంటే కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను తిట్టడమే ప్రధాన పనిగా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రోజురోజుకూ అసహనానికి లోనవుతున్నారు. ఆయన భార్య గీతమ్మకు ఫోన్ చేసి, ఆయన్ని ఇంట్లో కట్టేయమని, ఎవరినీ కరవకుండా చూడమని సరదాగా చెప్పాను అంటూ చెలోక్తులు విసిరారు. పండబెట్టి తొక్కుతా వంటి భాష ముఖ్యమంత్రికి తగదని, తిట్ల పురాణం ఆపి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఓటమికి కారణం ఐక్యత లేకపోవడమే
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను కేటీఆర్ విశ్లేషించారు. మనం గెలుస్తామన్న ధీమాతో దుప్పటి కప్పుకుని పడుకోవడం, మన మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఓడిపోయాం. కాంగ్రెస్ వాళ్లు అడ్డమైన హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు అని అన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో ఆ పొరపాటు జరగకూడదని, సర్పంచుల ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ-కాంగ్రెస్ చీకటి దొంగలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయని.. వారు చీకటి దొంగలు అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను బీజేపీ ప్రశ్నించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి, భూముల కేటాయింపుల్లో రూ. 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.
2028లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే!
రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ జోష్యం చెప్పారు. గ్రామాలే పార్టీకి పట్టుకొమ్మలని, సర్పంచ్లే గ్రామ కథానాయకులుగా మారి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదని, కారు గుర్తును చూసి కేసీఆర్ కోసం ఓటు వేయాలని కోరారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉయ్యాలవాడ నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ఎత్తున వాహన ర్యాలీ నిర్వహించారు.
