2026 | ఆధ్యాత్మిక సంరంభం..
2026 | ఆధ్యాత్మిక సంరంభం..
ఆంధ్రప్రభ : సాధారణంగా నూతన సంవత్సరం అంటే అందరిలోనూ ఒక తెలియని ఉత్సాహం.. కొత్త ఆశలు, ఆశయాలతో ప్రతి ఒక్కరూ జనవరి 1వ తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం, ప్రతి నగరం ఆ అర్ధరాత్రి కౌంట్‌డౌన్ కోసం సిద్ధమవుతుంటుంది. సరిగ్గా అదే జోష్ మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది.

అయితే, 2026 నూతన సంవత్సరం మాత్రం కేవలం ఒక క్యాలెండర్ మారడం మాత్రమే కాదు.. అంతకు మించిన ఉత్సాహం ఉండనుంది. ప్రపంచమంతా కేవలం జనవరి 1వ తేదీ వేడుకలతో సరిపెట్టుకుంటే, తెలుగు ప్రజలకు మాత్రం నెల అంతా సంబురాలు చేసుకోనున్నారు. జనవరి నెల మొత్తం ఒక మహా ఉత్సవంలా జరగనుంది.
ఈ నెల ఆరంభం నుండి ముగింపు వరకు ప్రతి రోజూ ఒక విశిష్టతతో, పవిత్రమైన తిథులతో క్యాలెండర్ కళకళలాడుతోంది. జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలతో ఘనంగా ఆరంభం కానుండగా… జనవరి మధ్యలో వచ్చే మకర సంక్రాంతి సంబరాలు పల్లె లోగిళ్లను పులకింపజేయనున్నాయి.

14న భోగి మంటల వెచ్చదనం, 15న సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే మకర సంక్రాంతి పుణ్యదినం, 16న పశువులను పూజించే కనుమ పండుగలతో యావత్ తెలుగు జాతి పండుగ వేడుకల్లో మునిగితేలనుంది. పల్లెటూళ్లు పిండివంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో కోలాహాలంగా మారిపోనున్నాయి.
ఇక ఈ పండుగ సందడి ముగియకముందే జనవరి 25న వచ్చే రథసప్తమి వేడుకలు సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఆధ్యాత్మికతను పతాక స్థాయికి తీసుకెళ్లనున్నాయి.
4th yuga | భగవన్నామ స్మరణ మోక్షసాధనం
అయితే, 2026 జనవరి నెలకు అసలైన వన్నె తెచ్చే అతిపెద్ద ఘట్టం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. దక్షిణ భారత కుంభమేళాగా పిలువబడే ‘మేడారం సమ్మక్క-సారక్క జాతర’. సాధారణంగా మాఘ మాస పౌర్ణమి ఘడియల్లో ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ జాతర, ఈసారి పక్షం రోజుల ముందుగానే అంటే జనవరి చివరలో రావడం ఒక విశేషం.
జనవరి 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు ములుగు జిల్లాలోని అడవి తల్లి గర్భంలో జరిగే ఈ మహా జాతర ఒక జన సముద్రాన్ని తలపించనుంది. దీంతో కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ అద్భుత వేడుక కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల భారీ నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది.

జనవరి 28న కన్నెపల్లి నుండి సారలమ్మ తల్లి గద్దెపైకి కొలువుదీరడం మొదలుకొని, 29న చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి రాక వరకు జరిగే ప్రతి క్షణం భక్తులలో ఒక అనిర్వచనీయమైన పూనకాన్ని తెప్పిస్తుంది. మూడో రోజున భక్తులు తమ బరువుకు సమానమైన ‘బంగారం’ (బెల్లం) తల్లులకు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకునే అపూర్వ దృశ్యం విశ్వవ్యాప్త గుర్తింపును పొందుతూ, గిరిజన సంస్కృతికి అద్దం పట్టనుంది.
ఇక ఆ తరువాత దేశభక్తి భావనలు కూడా ఈ నెలలో గూడుకట్టుకున్నాయి. జనవరి 26న దేశమంతా ఘనంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం (Republic Day) ఈ ఆధ్యాత్మిక మాసానికి ఒక జాతీయ గౌరవాన్ని అద్దుతుంది.
ఇలా 2026 జనవరి నెల తెలుగు ప్రజలకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. కొత్త ఏడాది తొలి నెలలోనే ఇన్ని విశేషాలు కేంద్రీకృతం కావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

