Collector | పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది

Collector | పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది

  • కలెక్టర్ సుమిత్ కుమార్

Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: భారత భవిష్యత్‌కు పిల్లలే మూలస్తంభాలని, వారిలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భారత బాలశక్తి@2047 వేడుకల అమలులో భాగంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను ఇవాళ జిల్లా కలెక్టర్ చాంబర్‌లో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో పిల్లలు, యువత చురుగ్గా పాల్గొనేలా ప్రేరేపించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చిన్ననాటి నుంచే ధైర్యం, త్యాగం, దేశభక్తి వంటి విలువలను అలవర్చడం ద్వారా ‘వికసిత్ భారత్’ దార్శనికతను సాకారం చేయవచ్చని పేర్కొన్నారు. యువ మనస్సులను సంస్కరించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు, శిశు సంరక్షణ కేంద్రాలు, యువజన సంఘాల్లో వీర్ బాల్ దివస్ వేడుకలు జరగనున్నాయని కలెక్టర్ వివరించారు.

విద్యార్థుల వయస్సును బట్టి పెయింటింగ్, వ్యాసరచన, కథల చెప్పడం, క్విజ్, గ్రూప్ డిస్కషన్లు, స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 27 నుండి 30వ తేదీ వరకు జిల్లా మరియు మండల స్థాయిల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన రాలీలు, వాకథాన్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలలో దేశభక్తిని పెంపొందించడం, దేశాభివృద్ధిలో వారి పాత్రను గుర్తింపజేయడం, అలాగే ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి జాతీయ లక్ష్యాలపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు

Leave a Reply