చిన్నారుల భవిష్యత్తును ముందే చదివే AI..

చిన్నారుల భవిష్యత్తును ముందే చదివే AI..
‘నవచేతన’తో అభివృద్ధి లోపాల గుర్తింపు!
తిరుపతి, ఆంధ్రప్రభ: అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 సంవత్సరాల లోపు పిల్లల ప్రారంభ మెదడు అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ‘నవచేతన’ కార్యక్రమాన్ని జిల్లాలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు.
మంగళవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఏఐ-ఎనేబుల్డ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ (ఈసీడీ) స్క్రీనింగ్ ఫర్ 0-6 ఇయర్స్ చిల్డ్రన్” అంశంపై రెండు రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల్లో అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నవచేతన’ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించే స్క్రీనింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్‌తో పాటు ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
రెండేళ్లలోనే 95 శాతం మెదడు అభివృద్ధి
పిల్లల మెదడు అభివృద్ధిలో సుమారు 80 శాతం తొలి ఏడాదిలోనే, 90 నుంచి 95 శాతం వరకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చేలోపే పూర్తవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కీలక దశలో అభివృద్ధి ఆలస్యం లేదా ఇతర సమస్యలను గుర్తించి తగిన జోక్యం చేసుకుంటే పిల్లల భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు.
స్క్రీనింగ్‌లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన చిన్నారులను జిల్లా ప్రారంభ జోక్య కేంద్రాలకు (డీఈఐసీ) రిఫర్ చేసి అవసరమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. పోషకాహారం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, నిపుణుల సలహాల ద్వారా అనేక సమస్యలను ప్రారంభ దశలోనే అధిగమించవచ్చన్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ప్రాథమిక గుర్తింపుకోసమేనని, అవి నిర్ధారణ పరీక్షలు కావని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాలని అధికారులకు సూచించారు.
తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకం
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధిలో తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమని తెలిపారు. ఈ దశలోనే ఎదుగుదల లోపాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నవచేతన’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.
పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని పైలట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి సానుకూల ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు.
మూడేళ్లలోపు అభివృద్ధి లోపాలను గుర్తించి తల్లిదండ్రులు, సంరక్షకులు, అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కల్పించడం ద్వారా సకాలంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో చిన్నారులు భవిష్యత్తులో విద్య, సామాజిక, వృత్తి రంగాల్లో మెరుగైన అవకాశాలు పొందగలరని అభిప్రాయపడ్డారు.
ఏఐ సాంకేతికతతో కచ్చితమైన అంచనా
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ, 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని అత్యంత కచ్చితంగా అంచనా వేయడానికి ఈ నూతన ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు.
పిల్లల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సత్వర చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
