Commissioner | బాధితులకు న్యాయం చేస్తాం

Commissioner | బాధితులకు న్యాయం చేస్తాం
కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్
Commissioner | ( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) నగరంలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనుల్లో భూమి, భవనాలు కోల్పోయే బాధితులందరికీ పూర్తి స్థాయి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. కర్నూలు నగరపాలక కార్యాలయంలో కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు (ఆర్డీపి-2), చెక్‌పోస్ట్ నుండి ఎస్‌ఎస్ గార్డెన్స్ వరకు రహదారి విస్తరణ పురోగతిపై పట్టణ ప్రణాళిక అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయడానికి అవసరమైన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాధితులకు ట్రాఫిక్ నియంత్రణకు రహదారుల విస్తరణ ఆవశ్యకతను వివరించి, యాజమాన్య పత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణలో ప్రభావితమవుతున్న 82 ఆస్తుల యజమానులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఎన్‌హెచ్-340సి రహదారి విస్తరణకు సంబంధించిన 201 ప్రభావిత ఆస్తుల యజమానులతో ఇరువైపులా సమగ్రంగా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేయాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం కాబట్టి, స్వచ్చంద సహకారం అందిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కమిషనర్ పేర్కొన్నారు. సమీక్షలో ఇంచార్జీ సిటి ప్లానర్ బి.వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, బిల్డింగ్ ఇంస్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
