Insurance money | బీమా డబ్బు కోసం హత్య

Insurance money | బీమా డబ్బు కోసం హత్య
ప్రమాదంగా చిత్రీకరించి
మిస్టరీ చేదించిన రామడుగు పోలీసులు
Insurance money | రామడుగు, ఆంధ్రప్రభ : రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువునే బీమా డబ్బుల (Insurance money) కోసం అన్నను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించిన సోదరుడి ఉదంతం కరీంనగర్ జిల్లా (Karimnagar District) రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొదట ప్రమాదంగా కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు అనుమానం వచ్చి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించారు. ఈనెల 29న రాత్రి గ్రామానికి చెందిన మామిడి వెంకటేష్ (39) సోదరుడి లారీ (Lorry) మరమ్మతు చేస్తుండగా సోదరుడు మామిడి నరేష్ లారీని ముందుకు తీసుకువెళ్లడంతో టైర్ల కింద పడి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రామడుగు పోలీసులు (Ramadugu Police) సంఘటన స్థలానికి వెళ్ళగా… మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీ (Lorry) ముందుకు వెళ్లిందని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు తదుపరి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. మామిడి నరేష్ అనేక వ్యసనాలకు లోనై అప్పుల పాలయ్యాడు. ప్రణాళిక ప్రకారం సోదరుడు వెంకటేష్ (Venkatesh) చేత కోట్ల రూపాయల బీమా వచ్చే విధంగా రెండు నెలలుగా పాలసీలు చేయించాడు. తదుపరి హత్యకు పథకం రచించాడు. ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం ప్రకారం గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రదీప్ కు బీమా డబ్బు వచ్చాక రెండు లక్షల రూపాయలు ఇస్తానని, ప్రమాద సమయంలో లారీ నడిపినట్లు ఒప్పు కునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అదేవిధంగా తను అప్పు ఉన్న రాకేష్ (Rakesh) కు అప్పుతో పాటు అదనంగా డబ్బులు ఇస్తానని పథకం మొత్తం వివరించాడు. పథకం ప్రకారం గత నెల 29న రామడుగు శివారులో లారీ నిలిచిపోయిందని మృతుడు వెంకటేష్ ను పిలిపించి జాకీ బిగించి మరమ్మత్తులు చేయాలని లారీ కింద ఉంచి పథకం ప్రకారం లారీని ముందుకు తీసుకువెళ్లడంతో టైర్ల కింద పడి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల విచారణలో హత్యోదంతం పూర్తిగా వెలుగులోకి రావడంతో ప్రమాద కేసును హత్య కేసుగా నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
