Gopal Ratna Award | జాతీయ గోపాల్ రత్న అవార్డు గ్రహీత అనురాధ సేవలు ప్రశంసనీయం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో పశువులకు సేవ చేస్తూ, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్ఠాత్మక జాతీయ గోపాల్ రత్న అవార్డు అందుకున్న నంద్యాల 15వ వార్డు చెందిన చాకలి అనురాధ సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఆదివారం పేర్కొన్నారు.

పశుసంవర్ధక శాఖలో ఉత్తమ కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ (బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్) విభాగంలో ఆమె తృతీయ బహుమతి దక్కించుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని గోస్పాడు మండలం, ఎం. చింతకుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖలో పశువులకు ఆమె అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఆమె విజయం నంద్యాల జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు జాతీయ స్థాయిలో ఈ విధంగా గుర్తింపు పొందడం ఇతర యువతకు, మహిళలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు.

ఆమె అందిస్తున్న సేవలు, చూపుతున్న నిబద్ధత ఈ అవార్డుకు తార్కాణమని ఫయాజ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో టిడిపి నాయకులు వేణు, ఎబినైజర్, గోసుల నాగేశ్వరరావు, రమేష్ పాల్, కామిని మల్లికార్జున, కరీం, అడ్వకేట్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.