DONATION| సోమేశ్వరుడికి సెంటున్నర స్థలం విరాళం
- కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేత
DONATION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పంచారామ క్షేత్రామైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంకు సెంటున్నర స్థలాన్ని దానం చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. సుమారు రూ.44 లక్షలతో రాజమండ్రికి చెందిన గన్నంనేని శివరామ కుమార్ సెంటున్నర స్థలాన్ని కొనుగోలు చేసి దేవస్థానంకు స్థలాన్ని అందజేయనున్నారు. దీనిలో భాగంగా బుధవారం కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానంకు అందించారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని, రూ .లక్షల విలువ కలిగిన స్థలాన్ని దేవస్థానంకు అందిస్తున్న దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణంరాజు, చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ.. స్వామివారి క్షేత్రం పక్కన ఉత్తరం వైపు గోడకు అనుకుని ఉన్న స్థలాన్ని దేవస్థానంలో కలుపుకునేందుకు దాతలు శివరామ కుమార్ ముందుకు వచ్చారని, ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్వామివారికి దానం చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా మొదట రూ. 20 లక్షలను స్థల యజమానికి అందించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని, మిగిలిన సొమ్మును కూడా అందించి స్థలాన్ని దేవస్థానంకు అందిస్తారని అన్నారు. దేవస్థానంకు స్థలం అందిస్తున్న దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నల్లం చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
