Supreme Court | కస్టడీ మరణాలు వ్యవస్థకే మచ్చ…

Supreme Court | కస్టడీ మరణాలు వ్యవస్థకే మచ్చ…

  • దేశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించదు
  • మా ఆదేశాలనూ తేలిగ్గా తీసుకుంటున్నారా
  • పోలీస్‌ కస్టడీ హింసపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
  • సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై సువెూటో విచారణ
  • సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ కార్యాలయాల్లోనూ సీసీటీవీలకు ఆదేశం

న్యూఢిల్లీ: పోలీస్‌ కస్టడీలో జరిగే హింస, మరణాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారం మొత్తం వ్యవస్థకే మాయని మచ్చ అని, దీనిని దేశం సహించలేదని వ్యాఖ్యానించింది. పోలీస్‌ స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని సుమోటో కేసుగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా రాజస్థాన్‌లో గత ఎనిమిది నెలల్లో పోలీస్‌ కస్టడీలో 11 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ, కస్టడీ మరణాలను ఎవరూ సమర్థించరని, సమర్థించే పరిస్థితి కూడా లేదని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ—కస్టడీ మరణాలపై కేంద్రం ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. “ఈ కోర్టును ఎందుకు తేలికగా తీసుకుంటున్నారు?” అని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నిలదీశారు.

దీనికి తుషార్‌ మెహతా సమాధానమిస్తూ, కోర్టును తేలికగా తీసుకునే ప్రశ్నే రాదని, మూడు వారాల్లో కేంద్రం కంప్లయెన్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తుందని హామీ ఇచ్చారు.

విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ—అమెరికాలో పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని పేర్కొంది. దీనికి స్పందిస్తూ సొలిసిటర్‌ జనరల్‌ మెహతా, అమెరికాలో రిసార్ట్‌ స్థాయి సౌకర్యాలు కలిగిన ప్రైవేట్‌ జైళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.

2018లోనే పోలీస్‌ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా (2020 ఉత్తర్వులు) అమలుపై దాఖలైన సుమోటో కేసులో అమికస్‌ క్యూరీగా సహకరిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు విన్న తరువాత, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ సహా అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కస్టడీ హింస, మరణాలపై సుమోటో రిట్‌ పిటిషన్‌ విషయంలో 11 రాష్ట్రాలు మాత్రమే అఫిడవిట్‌లు దాఖలు చేశాయని, మిగతా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా స్పందించలేదని ధర్మాసనం పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఉందని స్పష్టం చేసింది.

అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇస్తూ విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేసింది. ఆ గడువులోగా అఫిడవిట్‌లు దాఖలు చేయని పక్షంలో, ఆయా రాష్ట్రాల హోంశాఖ ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.