Reservations | పంచాయతీ రిజర్వేషన్లపై గందరగోళం!

Reservations | పంచాయతీ రిజర్వేషన్లపై గందరగోళం!
- బీసీలకు 20శాతంలోపు సీట్లు
- జీవో 46కు తూట్లు పొడిచిన అధికారులు
- జనరల్ కోటాలోకి మెజార్టీ స్థానాలు
- అంతుచిక్కని రిజర్వేషన్ లెక్కలు
ఆంధ్రప్రభ, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు.. 5058 వార్డులు ఉన్నాయి. ఈ స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను సోమవారం అధికారికంగా ప్రకటించారు. మొత్తం పంచాయతీలలో అచ్చంగా ఎస్టీలు ఉన్న పంచాయతీలు 92 ఉన్నట్లు గుర్తించారు.
ఈ పంచాయతీలలో గ్రామ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల స్థానాలను వారికి రిజర్వ్ చేశారు. ఇక సాధారణ కోటాలో మరో 27 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఇలా మొత్తం జిల్లాలో ఎస్టీ కోటాలోకి 119 గ్రామ పంచాయతీ స్థానాలు వెళ్లాయి. మరోవైపు ఎస్సీ లకు జిల్లాలోని 111 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను రిజర్వ్ చేశారు.
బీసీలకు 107 గ్రామ సర్పంచ్ స్థానాలు మాత్రమే రిజర్వ్ కావడం గమనార్హం. 257 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను జనరల్ కోటా లో ఉంచారు. బీసీలకు తక్కువ సంఖ్యలో పంచాయతీ సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంపై రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీ రిజర్వేషన్ల విషయంలో వివాదం..
గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 2011 జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎస్సీ, ఎస్టీలకు మొత్తంగా 27 శాతం సీట్లను ఖరారు చేయాలి. క్రితంసారి జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఇదే తరహాలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. అచ్చంగా ఎస్టీలు ఉన్న పంచాయతీలు జిల్లాలో 92 ఉన్నాయి.
వీటిని మినహాయించగా 502 పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎస్సీ, ఎస్టీలకు జిల్లాలో 138 పంచాయతీ సర్పంచ్ స్థానాలు దక్కడం జరిగింది. బీసీ రిజర్వేషన్ విషయంలోనే వివాదం కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి గతఏడాది నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాది, రాజకీయ కుల సర్వే నివేదికను ప్రాతిపదికగా తీసుకోవాలని జీవో 46లో స్పష్టం చేశారు.
