India | అఖిలేష్ నేతృత్వం.?
India | అఖిలేష్ నేతృత్వం.?
India kutami, న్యూఢిల్లీ : ఇండియా కూటమికి నేతగా సమాజ్వాది పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవన్ను (Akhilesh Yadav) నియమించాలని పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాజయం చవిచూసిన తర్వాత, ఇండియా కూటమికి నేతృత్వ మార్పు పై చర్చలు తీవ్రమవుతున్నాయి. అఖిలేష్జీని ఇండియా కూటమికి నేతగా చేయాలి. మా పార్టీ అధికారులు, ఎమ్ఎల్ఎలు, ఎంపీలందరూ ఇలా కోరుకుంటున్నారు అని లక్నో సెంట్రల్ ఎస్పీ ఎమ్ఎల్ఎ రవిదాస్ మెహ్రోత్రా స్పష్టం చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్, హర్యానా, మహారాష్ట్రలో కూడా విఫలమైంది. ఇది ఇండియా కూటమిలో అసంతృప్తిని పెంచింది. మరోవైపు అఖిలేష్ నేతృత్వంలో ఎస్పీ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 37 సీట్లు గెలుచుకుంది. లోక్ సభలో మూడవ పెద్ద పార్టీగా మారింది. ఉత్తరప్రదేశ్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో తమ పార్టీ ఉందని మెహ్రోత్రా చెప్పారు.
బీహార్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగి ఉంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉండేదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈవీఎంల పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలకు అఖిలేష్ మద్దతు తెలిపారు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతృత్వంలో పోరాడతామని చెప్పారు. ఇండియా కూటమికి నేతృత్వం వహించే విషయానికి వస్తే.. ముందు మమతా బెనర్జీని నేతగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ప్రతిపాదించారు. మమతకు ఆర్జేడీ దిగ్గజ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అఖిలేష్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇండియా కూటమిలో ప్రత్యామ్నాయ నాయకత్వం పై చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ స్థానంలో అఖిలేష్ ఎదిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరి కొన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://epaper.prabhanews.com
