Cotton | ఆ నిబంధనలు సడలించాలి..

Cotton | ఆ నిబంధనలు సడలించాలి..

Cotton, మైలవరం, ఆంధ్రప్రభ : 2025-26 పత్తి సీజన్లో ఒక్కో క్వింటాకు రూ.8,110లు మద్దతు ధర ప్రకటించి, పత్తి కొనుగోళ్ళకు శ్రీకారం చుట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా (Ntr District) మైలవరంలోని మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విక్రయ కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిని, అందులోని తేమ శాతాన్ని పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలో పత్తిని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందవలసినదిగా కోరారు. ఇక్కడి నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేసి 8 మిల్లులకు రవాణా చేయనున్నట్లు వెల్లడించారు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 12 శాతం లోపు ఉండాలని అన్నారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు, అధిక వర్షాల వల్ల పత్తిలో నాణ్యత తగ్గిందన్నారు. రైతు సోదరులు పత్తిని ఎక్కువ సేపు ఆరబెట్టి ఇక్కడకు కొనుగోలుకు తీసుకుని రావాలన్నారు.

రైతులకు ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా గోనె సంచుల్లో లేదా లూజుగా తెస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు జరిగిన నష్టం గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ (Janasena party) ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply