HYD | జూనియర్లే కానీ.. చేతివాటంలో ముదుర్లు

HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సైల విధి నిర్వహణ ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రధానంగా జూనియర్ బ్యాచ్‌ల కు చెందిన ఎస్సైలు, ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రతికేసులోనూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు రోజురోజుకు అధికమవుతున్నాయి.
సివిల్ సంబంధిత ఫిర్యాదులపై దృష్టిసారిస్తూ, స్టేషన్లను అడ్డాగా చేసుకుని వాటిని పరిష్కరిస్తూ, అందుకు ప్రతిఫలంగా పెద్దఎత్తున డబ్బులు జేబులో వేసుకుంటున్నట్లు పలువురు ఆధారాలను చూపుతున్నారు. కొందరు సీఐలు సైతం సీనియర్లను కాదని, జూనియర్లను ప్రోత్సహిస్తూ, వారి మధ్యవర్తితత్వం ద్వారా ఎస్‌హెచ్‌ఓలు కూడా లబ్ధిపొందుతున్నట్లు పేర్కొంటున్నారు.
సమర్థత, విధినిర్వహణలో నిబద్ధత కలిగిన వారికి సరైన పోలీసు స్టేషన్లలో పోస్టింగులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఇక మహిళా ఎస్సైల చేతివాటానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రతికేసుకు ఓ రేటును నిర్ణయించి, ఓపెన్ గానే బాధితులు, నిందితుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ పోలీసుశాఖ పరువు తీస్తున్నారు.
కమిషనరేట్ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సైల పనితీరు ఏమాత్రం మారడం లేదు. ఊహించని వధంగా ఎస్సైలకు ఫోకల్ పోస్టింగులు రావడంతో, మళ్లీ అవకాశం రాదు అన్నట్లుగా ప్రతి కేసు వెనుక ఎర్నింగ్ ఉండాల్సిందే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. నోటీసుల జారీ నుంచి మొదలు, విచారణ, చార్జీషీటు వరకు రెండు లేదా మూడు సార్లు ఎస్సైలకు చేతితడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇలాంటి వారికి సంబంధిత ఎస్ హెచ్ ఓలు అండగా నిలవడం, వారికి కూడా కొంత వాటాలు వెళ్లడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడం, వారిపై చర్యలు లేకపోవడమే వారికి కలసివస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
HYD | వసూళ్లలో జూనియర్ ఎస్సైల హవా..
ఫోకల్ పోలీసు స్టేషన్ల తో పాటు, అన్ని పోలీసు స్టేషన్లలో ప్రస్తుతం సీనియర్ల కంటే అధికంగా జూనియర్ ఎస్సైలు విధుల్లో ఉన్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా, వారికి ఫోకల్ పోలీసుస్టేషన్లలో పోస్టింగులు దక్కాయి. దీంతో ఇదే అవకాశంగా భావిస్తున్న జూనియర్ ఎస్సైలు, చేతివాటం ప్రదర్శి స్తున్నారు.
ఎస్‌హెచ్‌ఓలతో వసూళ్ల లెక్కలతో కూడిన సంబంధాలను కొనసాగిస్తూ, క్షేత్రస్థాయిలో తాము ఏమి చెబితే అదే అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ప్రతి ఫిర్యాదు పరిష్కారం వెనుక ఎంతో కొంత లబ్ధి పొందాల్సిందే అనేలా నిర్ణయించుకుని విధులు కొనసాగి స్తున్నారు. కొందరు ఏళ్లుగా పోలీసు స్టేషన్లను వీడకుండా, విధులు నిర్వహిస్తున్నారు.
ఇక కమిర్షయల్ ఎస్టాబ్లిస్ట్‌మెంట్స్ నుంచి ప్రతినెలా మాముళ్లు డిసైడ్ చేసేస్తున్నారు. కీలక జోన్లలో పనిచేస్తున్న కొందరు జూనియర్ ఎస్సైలపై ఆరోఫణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కనీసం బాధితులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వారికి పోస్టింగులు ఇవ్వడంతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దురుసు ప్రవర్తన, ఫోన్లు లేకపోవడం, నైట్ డ్యూటీలలో ఫోన్లు స్విఛ్ఛాప్ చేసుకోవడం, ఒకవేళ మాట్లాడినా బూతులతో సంభాషణ కొనసాగిం చడం జూనియర్ ఎస్సైలకు అలవాటుగా మారిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. కలెక్షన్స్ లలో ఏమాత్రం తీసిపోని విధంగా జూనియర్ ఎస్సైలు, ఇతరులతో మాట్లాడే పద్ధతిలోనూ అదే తీరూను కొ నసాగించడం విమర్శల పాటు చేస్తుంది.
HYD | తగ్గేదే లే.. అంటున్న మహిళా ఎస్సైలు
వసూళ్లలో తాము ఏమి తక్కువ కాదు అన్నట్లుగా మహిళా ఎస్సైలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇక అందులోనూ ర్యాంకర్ల ఎస్సైలు అయితే పోలీసుశాఖ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. నిందితులను వేధిస్తూ వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రైటర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రతినోటీసుకు ఓ లెక్క ఉండాలి అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిపై సంబంధిత ఎస్ హెచ్ ఓలు, ఏసీపీలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారికి బాగా కలిసివస్తుందని పోలీసు సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
HYD | ఆరోపణలు ఉన్నవారికే లా అండ్ ఆర్డర్ పోస్టింగులు..
లా అండ్ ఆర్డర్ విభాగంలో ఎస్సైలుగా కొనసాగుతున్న వారిపై తీవ్రమైన ఆరోపణలు, చార్జీషీట్లు, ఎంక్వైరీలు, పలువురిపై ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నా సరే, వారికి లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఇవ్వడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా లా అండ్ ఆర్డర్ విభాగంలో పోస్టింగులు ఇచ్చే ముందు, సంబంధిత ఎస్సైపై ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు, ఎన్ని చార్జ్ మెమోలు పెండింగ్ లు ఉన్నాయి?, ఏమైనా సస్పెన్సన్లు ఉన్నాయా ?, అనేవి పరిశీలిస్తారు.
కానీ ఇవేమి పట్టించుకోని ఉన్నతాధికారులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఎస్సైలకు, శాఖపరమైన చర్యలు తీసుకున్నఎస్సైలకే తిరిగి పోస్టింగులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆరోపణలు లేని వారికి ట్రాఫిక్ విభాగంలో పోస్టింగులు ఇస్తూ, ఆరోగ్యసమస్యలు ఉన్న ఎస్సైలను నాన్ ఫోకల్ పోస్టింగులకు బదిలీ చేయడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.
