GHMC | జీహెచ్‌ఎంసీలో సంస్కరణలు !

GHMC | జీహెచ్‌ఎంసీలో సంస్కరణలు !
- నగర పాలనలో కొత్త దిశకు సూచనలు
- పక్కా ప్రణాళికలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ముందుకు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : నగరాభివృద్ధి, పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలకరంగాల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ (GHMC) చేపడుతున్న చర్యలు హైదరాబాద్ నగర పాలనలో కొత్త దిశను సూచిస్తున్నాయి. వ్యర్థ నిర్వహణ నుంచి అవినీతి నియంత్రణ వరకు అన్నిరంగాల్లో కార్యాచరణలో మార్పు కనిపిస్తోంది.
ఆ దిశగా అడుగులు పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించే అంశం నుంచి సిబ్బంది హాజరు, టౌన్‌ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ లో ఆదాయం పెంపు, అవినీతి సిబ్బందికి స్థానచలనంతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపై జీహెచ్‌ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ దృష్టి, వీధికుక్కల విషయంలో సుప్రీం ఆదేశాలను వెంటనే అమల్లోకి తీసుకు రావడం వరకు పలు మార్పులు కనిపిస్తున్నాయి.
మరోవైపు రోడ్లపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను తరలించే ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇక కీలకమైన ఆదాయం పెంపు విషయంలో వచ్చిన సలహాలను వెంటనే అమలు చేసేలా కార్యాచరణ రూపొందించడానికి సిద్ధమవ్వడం వెంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
GHMC | ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్… వీటికి కొత్త రూపం !!
ప్రతిరోజూ వేల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న మన మెట్రో నగరంలో, జీహెచ్‌ఎంసీ తీసుకున్న తాజా నిర్ణయం పర్యావరణానికి మేలు చేసేదిగా భావిస్తున్నారు. నగరంలో సేకరించే ప్లాస్టిక్‌ను పునర్‌వినియోగంతో టైల్స్‌గా మార్చి, ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో వినియోగించేందుకు ప్రాథమిక చర్యలు ప్రారంభించాయి.

పైలట్ ప్రాజెక్ట్ గా ఫిల్మ్ నగర్, రాజ్ భవన్ రోడ్ మార్గాలపై త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఈ చర్యతో ఇకవైపు ప్లాస్టిక్ సమస్యకు చెక్‌పెట్టడంతో పాటు నగర నిర్మాణాల్లో సుస్థిరత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
GHMC | స్టాఫ్ హాజరులో ఏఐ వినియోగం…
ఇక అధికారులు, సిబ్బందిలో పని వేగాన్ని మెరుగుపర్చడం, హాజరు వ్యవస్థలో లోపాలను తగ్గించడం లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా ఏఐ ఆధారిత ఫేసియల్ రికగ్నిషన్ హాజరు సిస్టమ్ అమలు చేస్తోంది. అన్ని సర్కిల్, జోన్ కార్యాలయాలతో పాటుగా ప్రధాన కార్యాలయంలోనూ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగుల ఇన్ అండ్ ఔట్ రికార్డులు ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి.
దీని ద్వారా మానవ తప్పిదాలు, ప్రాక్సీ హాజరు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ కారణంగా ఉద్యోగులు, సిబ్బందిలో నూ జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరించకుండా పని తీరు మెరుగుపర్చుకోవడానికి అవకా శమేర్పడుతుందని సీనియర్ అధికారు లు చెబుతున్నారు. మరోవైపు, అధికారు లకు ఇచ్చిన వాకీటాక్‌లను ట్రాకింగ్ చేసే అవకాశం ఉండడంతో విధుల సమయా ల్లో వారెక్కడ ఉన్నారో కూడా తెలిసిపోతుంది.
GHMC | భవన అనుమతుల్లో భారీ వృద్ధి… GHMCకి అదనపు ఆదాయం….
ఇక జీహెచ్‌ఎంసీకి కీలకమైన ఆదాయ వనరుల్లో ఒకటి టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ విస్తరణ కొనసాగుతుండగా, జీహెచ్‌ఎంసీకు భవన అనుమతుల రూపంలో భారీ ఆదాయం లభిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో హైరైజ్ బిల్డింగ్ అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ గత ఐదు నెలల్లోనే దాదాపుగా రూ.900 కోట్లకు పైగా ఆదాయం రాబట్టింది.

ప్రత్యేకించి నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ అంతస్తుల భవనాలకు అనుమతులు పెరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ వృద్ధి ఒకవైపు నగర అభివృద్ధిని సూచిస్తే, మరోవైపు ట్రాఫిక్ ఒత్తిడి, మౌలిక వసతుల నిర్వహణపై జీహెచ్‌ఎంసీకు పెద్ద సవాలుగా నిలిచే అవకాశం కూడా ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నా రు. అంటే, దీనిబట్టి ఈసారి భవన నిర్మాణ అనుమతులు భారీగానే వచ్చా యని, తద్వారా భారీగా ఆదాయం చేకూరిందని అర్ధమవుతోంది.
GHMC | అవినీతి ఆరోపణలపై చర్యలు
ఇదే సమయంలో టౌన్ ప్లానింగ్ విభాగంపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరోధించేందుకు జీహెచ్‌ఎంసీ ఇటీవలే 20కు పైగా ప్లానర్లను బదిలీ చేసింది. అనధికార భవనాలు, లంచం ఆరోపణల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. అదనంగా, భవనాల అన్‌సీలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం కొత్త ఎస్ ఓ పీ లు రూపొందిస్తున్నారు.
నగర పాలనపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో అప్లికేషన్‌ల అప్‌లోడ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా పలువురు ఆర్కి-టె-క్ట్‌లకు కూడా త్వరలో చెక్‌పెట్టబోతున్నారు. వీరు మధ్యవర్తులుగా ఉంటూ అప్లికేషన్‌ల అప్‌లోడ్‌లో కావాలనే కొన్ని తప్పుడు ఫార్మాట్‌లో అ్లప చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
GHMC | వీధి కుక్కల సమస్యపై దృష్టి.. అమల్లోకి సుప్రీం ఆదేశాలు
నగరంలోని వీధి కుక్కల సంఖ్య పెరుగుతుండడంతో జీహెచ్‌ఎంసీ స్టెరిలైజేషన్ డ్రైవ్‌లను ఇటీవవలే వేగవంతం చేసింది. ఎన్జీఓల సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజా భద్రత కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే షెల్టర్ ప్రాంతాల కొరత, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఇంకా ఉండడంతో కొంత ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు వస్తున్నాయి.

దీనిపై కూడా దృష్టిపెట్టి త్వరలోనే సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో జన సమూహాలు అధికంగా ఉండే ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రార్ధనా మందిరాల వంటి ప్రాంతాల్లోని వీధి కుక్కలను వెంటనే షెల్డర్ హోంలకు తరలించి వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సుప్రీం కోర్ట్ ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
GHMC | ఇలాంటివి మరెన్నో సంస్కరణలు…
వీటితో పాటుగా నగర వ్యాప్తంగా చెత్త సమస్యకు చెక్ పెట్టేలా శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారన్న కారణంగా రాంకీ సంస్థకు పలుమార్లు జరిమానాలు కూడా విధించడం సంచలనమైంది. మరోవైపు నగరంలో ఎక్కడికక్కడ ఏర్పడుతోన్న గుంతల కారణంగా వస్తోన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రతి రోజూ రోడ్‌సేప్టీ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టి ఇప్పటి వరకూ 20 వేలకు పైగా గుంతలను పూడ్చారు.
ఇక హోటళ్లు మొదలుకొని స్వీట్ షాప్‌ల వరకు వస్తోన్న ఫిర్యాదులతో నిరంతర ఫుడ్ సేప్టీ తనిఖీలు చేపట్టడం ఒక టాస్క్‌గా తీసుకున్నారు. మరోవైపు నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి చేయూతగా ఉండేలా ఇటీవలే రూ. 30 లక్షల భీమా ఇప్పించే ఏర్పాట్లు చేశారు. ఇక స్వయంగా కమిషన్ ఆర్ వీ కర్ణన్ ప్రతి నెలా రిటైర్మెంట్ అవుతోన్న ఉద్యోగులు, సిబ్బందికి బాద్యతలను ఇంత కాలం నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్పడం గతంలో దాదాపుగా లేదనే చెప్పాలి. ఇక కీలకమైన ఫ్లైఓవర్‌ల ప్రాజెక్ట్‌ల విషయంలో ముఖ్యంగా కేబీఆర్ ఫ్లైఓవర్‌ల విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుని అభ్యంతరాలు చెబుతోన్న వారితో స్వయంగా మాట్లాడడం విశేషం.

GHMC | కీలక నిర్ణయాలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ముందుకు..
మరోవైపు చిరు వ్యాపారులకు యూసీడీ ద్వారా పీఎం స్వనిది స్కీమ్, ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగావకాశాలు, కోటి మంది మహిళలకు రుణాల విషయంలో వయసు అర్హత విషయంలో మార్పులు, ఎలక్ట్రాన్రిక్ వస్తువుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు వాటి డిజిటలైజేషన్, ట్రాకింగ్, సీఆర్‌ఎంపీలో డీసిల్టింగ్ పనులు తీసివేయడంతో రూ.వెయ్యి కోట్ల ఆదా, జెనరేటివ్ ఏఐ నగరంగా గూగుల్‌తో భాగస్వామ్యం ఇలాంటివి ఈ మధ్య కాలంలో వరుసగా సంస్కరణలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి… స్మార్ట్ సిటీ దిశగా ముందుకు సాగుతున్న హైదరాబాద్‌కు జీహెచ్‌ఎంసీ కీలక వైపు నడిపిస్తోంది. పర్యావరణం, పారదర్శకత, అభివృద్ధి ఈ మూడు కీలక అంశాల్లో జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు నగర భవిష్యత్తు తీరు నిర్ణయించనున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న జనాభా, రియల్ ఎస్టేట్ ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాల ప్రణాళికలు, బలమైన అమలు వ్యవస్థ జీహెచ్‌ఎంసీ ముందు ఉన్న ప్రధాన సవాలు.
