Security tight | భద్రతా వలయంలో భాగ్యనగరం..

Security tight | భద్రతా వలయంలో భాగ్యనగరం..
హైదరాబాద్ : ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. రెండు రోజుల క్రితం ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరుకోగా, గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.
ఈ దుర్ఘటనతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మెట్రో నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అయితే ఉగ్రదాడుల మూలాలు హైదరాబాద్ వైపు చూపడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల రాజేంద్రనగర్‌లో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఉగ్రవాద అనుమానాలపై అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించిన పోలీసులు పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలు, డిజిటల్ డేటా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
సయ్యద్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల NIA, పోలీసు బృందాలు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు కొనసాగిస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.
ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా వెంటనే 100 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రూమర్లు లేదా సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు ఫలప్రదమవుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
