దద్దరిల్లిన ఢిల్లీ..

దద్దరిల్లిన ఢిల్లీ..
ఢిల్లీలో భారీ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. దేశ రాజధాని ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర ఈ భారీ పేలుళ్లు సంభవించాయి. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. పేలుడు జరిగిన 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం వుంది. 100 నుంచి 150 మీటర్ల వరకు పేలుడు ధాటి పరిధి ఉంది. సంఘటనా స్థలం అంతా భీభత్సంగా మారింది. సోమవారం సాయంత్రం 6:52 నిమిషాలకు ఈ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.
ఈ పేలుడలో 9 మంది మరణించగా.. ఆసుపత్రికి తరలించేలోపే 8 మంది మృతి చెందారని.. 30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులను ఎల్ఎన్జెపీ (లోకనాయక్ ఆసుపత్రి) ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడుతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో ఉగ్రవాదులు పాగా వేసినట్టు సమాచారం.
నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను పోలీసులు గుర్తించారు. అయితే.. పేలుడుకు ఉపయోగించిన కారు యాజమానిని పోలీసులు గుర్తించి కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్రకోణం వంటివి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి.
