ఈ ఏడాది ఎముకలు కొరికే చలి..!

- వాతావరణ నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు, ప్రజలకు వాతావరణశాఖ మరో కీలక హెచ్చరికను జారీ చేసింది. ఈసారి రానున్న శీతాకాలం సాధారణానికి మించి తీవ్రంగా ఉండబోతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ ఏడాది వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో రికార్డు స్థాయి వర్షాలు నమోదవడంతో వాతావరణ చక్రం పూర్తిగా మారిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో నవంబర్ నెలలో గత ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత చలి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రాత్రివేళల్లో చలి తీవ్రత పెరుగుతూ ఉండగా, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇటీవలి ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ మారిపోవడంతో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిందని అధికారులు తెలిపారు.
రాబోయే 10 నుండి 15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగి, రాత్రివేళల్లో గాలి చలితో వణికించే పరిస్థితులు నెలకొనవచ్చని నిపుణులు చెప్పారు. ఒక దశలో విపరీత వర్షాలు కురిస్తే, ఆ తరువాతి దశలో పొడి వాతావరణం తప్పదనే స్పష్టమైన సంకేతాలను ఈ సీజన్ ఇస్తోంది అని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రజలు చలి తీవ్రతను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
