వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం

వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ …
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ గుర్తింపు భావన, ఆంగ్లేయుల పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం గీతం, మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చిందని, జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించి దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారిందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ (Badawat Santosh) అన్నారు. వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఐడిఓసి ప్రధాన సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… జాతీయ గీతం (National Anthem) ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు.
ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు, భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
