జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం !!

- నవీన్ యాదవ్‌కు కమ్మ, కాపు, గౌడ సామాజిక వర్గాల మద్దతు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
యూసుఫ్ గూడా, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ యూసుఫ్ గూడా డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, కమ్మ, కాపు, గౌడ వంటి సామాజిక వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేలా చొరవ తీసుకున్నారు.
ఉదయం కృష్ణనగర్‌లో కాపు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల క్రితం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డ కాపు సంఘాలను ఐక్యంగా చేర్చి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వారు ఏకగ్రీవంగా నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించారు.
స్థానికుడు, విద్యావంతుడు అయిన నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఇన్‌చార్జి మంత్రిగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని మంత్రి హామీ ఇచ్చారు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన ప్రభుత్వమే బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చిందని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ నిజమైన ఛాంపియన్ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం కృష్ణనగర్‌లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
తర్వాత మధురానగర్‌లో గౌడ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. “యాదవ్, గౌడ్ వేరు కాదు.. బలహీన వర్గాలంతా ఐక్యంగా ఉండి నవీన్ యాదవ్‌ను గెలిపించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేసేలా స్థానిక నాయకులను సంప్రదించి, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు అభ్యర్థించాలని సూచించారు.
సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు చిన్న శ్రీశైల యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయం. నవీన్ యాదవ్ గెలుపు కోసం నేను గల్లీ గల్లీ తిరుగుతున్నాను అని తెలిపారు.
అలాగే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో యూసుఫ్ గూడా కాంగ్రెస్ కార్యాలయంలో కమ్మ సంఘం నాయకులతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ రావు మాట్లాడుతూ, నవీన్ యాదవ్‌కు తెలంగాణ వ్యాప్తంగా 60 కమ్మ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 40 వేల కమ్మ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తారు అని ప్రకటించారు.
ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసినందున, దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.




