కిష‌న్ రెడ్డికి పొన్నం స‌వాల్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద జోక్‌లా అనిపించాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో మాత్రం బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై రాజకీయ లాభాల కోసం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ భాగమే. మీరు కేంద్ర మంత్రి అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఏ శ్రద్ధా చూపలేదు. గతంలో ఇదే అభ్యర్థి పోటీ చేసి 25 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి అదే అభ్యర్థికి 10 వేల ఓట్లు కూడా దాటవని నేను సవాల్‌ చేస్తున్నాను అని అన్నారు.

మీరు నేరుగా బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి, అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి, ప్రచార యంత్రాంగాన్ని మొత్తం బీఆర్‌ఎస్‌కు అప్పగించారు. మీరు గెలిచినప్పుడు వారి మద్దతు తీసుకున్నారు, ఇప్పుడు వారికి తిరిగి రుణం తీర్చుకుంటున్నారు అని పొన్నం ఎద్దేవా చేశారు.

జూబ్లీహిల్స్ ప్రజల్లో మీ బీజేపీ వ్యవహారశైలి గురించి చర్చ నడుస్తోంది. ఈ ఉపఎన్నికల్లో మీ అభ్యర్థి 10 వేల ఓట్లు కూడా దాటరని నేను మళ్లీ స్పష్టం చేస్తున్నాను. చాలెంజ్ చేయడానికి సిద్ధమా? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ సహా మొత్తం నియోజకవర్గ అభివృద్ధి దిశగా కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ చూపని మీరు ఇప్పుడు ఉపఎన్నికల్లో ప్రగల్భాలు పలకడం ప్రజల నవ్వుకు కారణమవుతోంది అని విమర్శించారు.

ఇప్పటికైనా మీ అభ్యర్థిని మోసం చేయకుండా, ఎదురు పార్టీలకు అమ్మకుండా నిజాయితీగా పని చేయండి. రాజాసింగ్ చెబుతున్నట్టుగా మీరు నిజాయితీగా వ్యవహరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.