హైదరాబాద్‌లో కుండపోత..

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరం మొత్తం వర్షం తాకిడికి తడిసి ముద్దవగా, పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం, ముఖ్యంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
వివిధ ప్రాంతాలలో వర్షం పరిస్థితి..
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, నిజాంపేట్ వంటి ఐటీ కారిడార్లలోనూ భారీ వర్షం పడుతోంది.
నగర శివార్లైన బాచుపల్లి, అల్వాల్, బొల్లారం, బేగంపేట, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, సూరారం, జీడిమెట్ల, గాజులరామారం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కొనసాగుతోంది.
ట్రాఫిక్ జామ్ !!
వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమవ్వగా… వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. మాదాపూర్-హైటెక్ సిటీ చౌరస్తా, ఐకియా మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఈ పరిస్థితి వల్ల ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణ శాఖ అంచనాలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే రోజులలో కూడా వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 2-3 గంటల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో గంటకు 41–61 కి.మీ.ల మధ్య గాలి వేగం ఉండవచ్చని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ వర్షాల కారణంగా చెట్టు, భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున.. నగరంలోని పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మ్యాన్‌హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని GHMC హెచ్చరించింది.
