శంషాబాద్‌లో ప్రభుత్వ భూమి రికవరీ..

  • హైడ్రా యాక్షన్ – 12 ఎకరాలు స్వాధీనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ భూముల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ బాధ్యతను చేపట్టిన హైడ్రా టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకోగా, తాజాగా మరో కీలక విజయాన్ని సాధించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శాతంరాయ్ గ్రామంలో రూ.500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది.

ప్రహరీ, షెడ్ల తొలగింపు

ఇంటర్మీడియట్‌ బోర్డుకు 2011లో కేటాయించిన ఈ భూమిపై గత కొంతకాలంగా ఆక్రమణ యత్నాలు జరుగుతున్నాయి. “ఈ భూమి మా సొంతం” అంటూ స్థానికంగా ఒక నేతతో పాటు అనీస్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ హక్కులు క్లెయిమ్ చేస్తూ అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక, భూమి చుట్టూ ప్రహరీ కట్టేసి, షెడ్లు కూడా నిర్మించారు. ఈ పరిణామాలపై స్థానికులు, అలాగే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

కబ్జాదారుల వాదనలు తిప్పికొట్టిన అధికారులు

“మేము పాయగా కుటుంబ వారసుల నుంచి ఈ భూమి కొన్నాం, వ్యవసాయం చేస్తున్నాం” అని కబ్జాదారులు చెబుతున్నా, రెవెన్యూ అధికారులు స్ప‌ష్టం చేశారు. శంషాబాద్ మండలంలో పాయగా కుటుంబ భూములే లేవు. వేరే ప్రాంతానికి చెందిన రికార్డులను ఇక్కడ చూపించి కబ్జా ప్రయత్నం చేశారని తేల్చారు. అంతేకాక, అనీస్ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీపాద దేశ్ పాండే ఇప్పటికే అనేక భూవివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు సమాచారం అందింది.

అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం, ఈ 12 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవేనని హైడ్రా ధృవీకరించింది. వెంటనే ఆక్రమణలను తొలగించి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇందులోని ఒక ఎకరం పరిధిలో ఉన్న కొన్ని నివాసాలు, దేవాలయం, మసీదు మాత్రం కాపాడుతూ మిగతా భూమిని ఆక్రమణల నుంచి విముక్తి కల్పించింది. చివరగా, ఆ ప్రాంగణంలో “ప్రభుత్వ భూమి – హైడ్రా పరిరక్షణలో ఉంది” అని బోర్డులు ఏర్పాటు చేసింది.

Leave a Reply