చెరువులను తలపించిన రోడ్లు..

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) లో ఉపరితల ఆవర్తనం కమ్ముకోవడంతో మెదక్ జిల్లాలో ఈ రోజు కుండపోత వర్షం కురిసింది. మూడున్నర గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలోని మెదక్, హవేలిఘనపూర్, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట, రామాయంపేట, నార్సింగ్, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు, ప్రధాన రహదారులు (Main roads) జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించగా, నివాస గృహాలు, దుకాణాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.

మెదక్ పట్టణం (Medak town)లో ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పట్టణంలోని వెంకట్రావ్ నగర్, సాయి నగర్, బృందావన్ కాలనీ, గాంధీనగర్, ఫతేనగర్ కాలనీలు జలమయమై ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. మెదక్ (Medak) లోని రాందాస్ చౌరస్తా, ఎంజీ రోడ్డు, జెఎన్ రోడ్డు, మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లు చెరువులను తలపించాయి. మోకాళ్ల లోతు నీటిలో రోడ్డు దాటుతూ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

దుకాణ సముదాయాల ఎదుట ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో పార్కింగ్ చేసిన ఆటోలు, కార్లు, బైక్ లు, ఇతర వాహనాలు సగభాగం నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు (Municipal officials) రాందాస్ చౌరస్తాలోని డివైడర్ కొంత భాగాన్ని జేసీబీ సహాయంతో తొలగించి వరద నీటిని డైవర్ట్ చేశారు. అలాగే మెదక్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలోకి వరద నీరు చేరుకోగా విద్యార్థినులు సురక్షితంగా బయటకు వెళ్లారు.
