కొల్లేరుకు వరద తాకిడి..

(ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : ఏరులూరు దుఃఖదాయిని తమ్మిలేరు పరవళ్లు తొక్కుతోంది. నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తటంతోనే .. ఏలూరు వైపు తమ్మిలేరు ఉరుకులు పరుగులు పెడ్తోంది. ఇక తమ్మిలేరు రాకతో ఏలూరు జనం బిక్కుబిక్కు మంటుంటే.. ఈ తమ్మిలేరుకు మరిన్న వాగులు జత కలవటంతో.. కొల్లేరు జనం.. కొంపకొల్లేరే అని ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో బుడమేరు ఉగ్ర రూపం దాల్చటంతో.. కొల్లేటిలోని లంక గ్రామాలు అల్లాడిపోయాయి.
ఈసారి ఒకవైపు బుడమేరు. మరో వైపు తమ్మిలేరు దాడితో.. కొల్లేరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. గోనెల వాగు నుంచి భారీ వరద నీరు చేరుతోంది.
ఈ నేపథ్యంలో నాగిరెడ్డి గూడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ స్థితిలో తాజాగా నాగిరెడ్డి ప్రాజెక్టు ఒక గేటును తెరిచి నీటిని కిందికి విడుదల చేయటంతో తమ్మిలేరు ఉదృతంగా పరవళ్లు తొక్కుతోంది. ఏలూరు పడమటి లాకులు, తూర్పు లాకుల నుంచి తమ్మిలేరు ఉరకలెత్తుతోంది.
ఇప్పటికే ఏటి గట్టును తమ్మిలేరు తాకుతోంది. కొల్లేరు వైపు జరజర పరుగులుతోంది. ఇక ఈ రోజు రాత్రి మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందనే సమాచారంతో ముంపు గురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు బాంబేలు పడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ , మున్సిపాలిటీ అధికారులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అప్రమత్తం చేశారు.
తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తమ్మిలేరు సమీపంలోని లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కల గకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకర తమ్మిలేరు రాకతో ఏలూరు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తమ్మిలేరు వరద నీటికి ఇతర వాగుల నీరు జత కలవటంతో.. కొల్లేరుకు వరద పోటు తప్పటం లేదు. కొల్లేరు లోకి నేరుగా వెళ్లకుండా దారిమళ్లించే చానలైజేషన్ లేకపోవడంతో తమ్మిలేరులో వరద పరిణామం పెరుగుతోంది. ఏలూరు పరిసర గ్రామాల్లో ముంపు బెడద భయపెడుతోంది.
ఈ స్థితిలో ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లల్లో అధికారులు బిజీ బిజీ అయ్యారు. ఏలూరులోని టూ టౌన్ ప్రాంతంలోని మార్కెట్ యార్డ్ ప్రదేశం తదితర ప్రాంతాలలో వరద తాకిడితో తమ్మిలేరు గట్లకు గండ్లు పడే పరిస్థితి ఉందని, ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను మెరక ప్రాంతాలకు తరలించాలని, చిన్నారులను రక్షించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు ఆమె సూచనలు ఇచ్చారు. తమ్మిలేరు , బుడమేరు, గుండేరు వాగు, నల్లేరు కోడు, ఇతర వాగులన్నీ కూడా వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మరికొన్ని గంటల్లోనే ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకుంటుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం నాగిరెడ్డి గూడెం డ్యాము వద్ద ఒక గేటు ఎత్తడంతో తమ్మిలేరు ఈ విధంగా ప్రవహిస్తోంది. ఈ రాత్రికి మరో మూడు గేట్లుఎత్తే అవకాశం ఉన్నట్లు అనధికార సమాచారం.
నాగిరెడ్డిగూడెం వద్ద మరో మూడు గేట్లు ఎత్తినట్లయితే తమ్మిలేరు ఉగ్రరూపాన్ని ఏలూరు వాసులు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏలూరు పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
