ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) పై జరిగిన దాడి దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడికి అసలు కారణం వీధి కుక్కల (dogs) సమస్య అని తెలుస్తోంది. ముఖ్యంగా జంతు ప్రేమికుడు (animal lover) అయిన నిందితుడు.. ఇటీవలే సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు విషయంలో సాయం కోరేందుకు ముఖ్యమంత్రిని కలిశాడు. అయితే ఈ విషయంపై ఆమె స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల విచారణలోనే ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడి వింత వాదన
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta) పై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై దాడి చేశానని, అలా చేయమని తనకు శివుడే చెప్పాడని నిందితుడు రాజేశ్ సకారియా వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని, వీధికుక్కల సమస్యపై ఢిల్లీ వెళ్లి సీఎం సహాయం కోరమని సాక్షాత్తూ శివుడే తనకు చెప్పాడని పేర్కొన్నాడు.
సుప్రీం తీర్పుతో రైలెక్కి ఢిల్లీకి..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేశ్ సకారియా(Rajesh Sakaria)కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడు టికెట్ లేకుండానే రైలెక్కి గుజరాత్ నుంచి హుటాహుటిన ఢిల్లీ (Delhi)కి చేరుకున్నాడు. నిన్న షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, వీధికుక్కలను తరలించవద్దని కోరుతూ ఆమెకు ఒక వినతిపత్రం సమర్పించాడు. ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన సకారియా, ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఆమె చెంపపై కొట్టి, దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.