వర్ష ప్రభావం.. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమస్య !

- 5 విమానాలు దారి మళ్లింపు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. ఐదు విమానాలను అధికారులు ఇతర నగరాలకు మళ్లించారు.
వివరాల్లోకి వెళితే, ల్యాండింగ్‌కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో మూడు విమానాలను విజయవాడకు, మరో రెండు విమానాలను తిరుపతి, బెంగళూరులకు పంపించారు. ఈ కారణంగా ప్రయాణికులు అక్కడి నుంచి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.
హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షం వల్ల పలు రహదారులు నీట మునిగిపోయాయి. వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వాయు ప్రయాణాలు కూడా వాతావరణం అనుకూలించేవరకు వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారు.
