Khammam | ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తోంది.. స్థానిక ఎన్నికలలో ఆ పార్టీకి బొంద పెట్టాల్సింది : కెటిఆర్

అబద్ధపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్
రెండు లక్షల ఉద్యోగాలని యువతకు మోసం
4వేల పెన్షన్ అని వృద్ధులకు మోసం
42శాతం రిజర్వేషన్ అని బీసీలకు మోసం
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అన్నారు
ఏడాదిన్నర గడిచినా ఏదీ జరగడం లేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలి
ఖమ్మం జిల్లా ముఖ్యకార్యకర్తల భేటీలో కేటీఆర్
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
కేసీఆర్ (KCR ) హయాంలో (Regime ) తెంగాణ (telangana ) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS working president ktr ) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు (farmers ) బోగస్ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు. ₹4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వయోవృద్ధులను, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తున్నదని ప్రజలు బాధపడుతున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి…
ప్రభుత్వంపై ప్రజలకు కోపం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలి. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత సమష్టిగా తీసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సహకారం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువస్తే ఏం జరుగుతుందో రేవంత్, బీజేపీకి తెలుసన్నారు. కేసీఆర్ 100 సీట్లతో ఏకపక్షంగా అధికారంలోకి వస్తారని అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ లాంటి దుర్మార్గులు ఉంటారని అంబేద్కర్ ఊహించలేదని కేటీఆర్ అన్నారు.
ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి సున్నా..
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు, ముగ్గురు మొనగాళ్లులా తిరుగుతున్నారని.. అయినా అభివృద్ధి మాత్రం సున్నా అని కేటీఆర్ విమర్శించారు. ఓ మంత్రి బాంబులు.. బాంబులు అంటూ తిరుగుతున్నారని, చివరికి పొంగులేటి కాస్తా బాంబులేటిగా అయ్యారని ఎద్దేవా చేశారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు పెడితే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి అద్భుతమైన అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ చంద్రవతి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ..
ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపాటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
