Supreme Court | కావేరీ జలాలపై కీలక సూచనలు..

తమిళనాడుకు నీటి విడుదల ఆదేశాలు పాటించాలన్న కోర్టు


Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కావేరీ నదీ జలాల పంపకాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలన్న కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) సిఫార్సుల మేరకు తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 12 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూఎంఏ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక అమలు చేయడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. అథారిటీ ఆదేశాలను విస్మరించకూడదని సూచించింది. నిర్ణీత స్థాయిలో నీరు అందకపోవడంతో తమ రాష్ట్రంలోని సాగు అవసరాలు దెబ్బతింటున్నాయని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. కావేరీ బేసిన్‌లోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కృష్ణరాజ సాగర్‌, కబిని, హారంగి, హేమావతి జలాశయాల్లో సగటు కంటే 47 శాతం తక్కువ నీరు ఉందని వెల్లడించింది.

కావేరీ జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. రాష్ట్రంలోని నీటి లభ్యత, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టులో తదుపరి వాదనలకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.