కోరుట్లలో ప్రభుత్వ భూమిపై కన్ను
కోరుట్లలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు
సర్వే నంబర్ 295లో 0.21 గుంటల భూమి వివాదం
22ఏ జాబితాలో ఉన్న భూమి అక్రమ రిజిస్ట్రేషన్?
ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ఆరోపణలు
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్
జగిత్యాల జిల్లా కోరుట్లలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిషేధిత 22ఏ జాబితాలో ఉన్న భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 295లోని ఎస్సారెస్పీకి చెందిన 0.21 గుంటల భూమి విషయంలో ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వ భూమిని కాపాడి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జగిత్యాల ప్రతినిధి, (ఆంధ్రప్రభ): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిషేధిత 22ఏ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకుని దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కోరుట్ల పట్టణంలోని సర్వే నంబర్ 295లో ఉన్న 0.21 గుంటల భూమి ఎస్సారెస్పీకి సంబంధించిన ప్రభుత్వ భూమి అని తెలుస్తోంది. ఈ భూమిని కొందరు కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కోరుట్లలోని సర్వే నంబర్ 295లో 1 ఎకరం 14 గుంటల భూమి ఉండగా, ఇందులో 0.21 గుంటల భూమిని ఎస్సారెస్పీ కోసం భూసేకరణ ద్వారా సేకరించారు. ఈ భూమికి భూసేకరణ అవార్డు కాపీ కూడా ఉండటం గమనార్హం.
అయితే కొందరు ఈ 21 గుంటల ఎస్సారెస్పీకి చెందిన ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎస్సారెస్పీ భూమిలో అక్రమ నిర్మాణం?
కోరుట్లకు చెందిన మహమ్మద్ ఆమేర్ ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, కోరుట్ల ఆర్డీవో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిషేధిత 22ఏ జాబితాలోని భూములను రెవెన్యూ అధికారులే కాపాడాల్సి ఉండగా, జిల్లాలోని రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం ఆందోళనకరంగా ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొంటున్నారు.
నిషేధిత 22ఏ జాబితాలో ఉన్న 0.21 గుంటల భూమి ప్రభుత్వానికి సంబంధించినదని, వెంటనే ఆ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై, అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, రికార్డులను పరిశీలించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు.
