నాగదేవతకు ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతుల ప్రత్యేక పూజలు

మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన నాగదేవత పూజా కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆయన సతీమణి గండ్ర పద్మ దంపతులు పాల్గొన్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగదేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సాగు చేసిన పంటలు బాగా పండాలని, ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలంతా ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. ఎల్లారెడ్డిపల్లిలోని నాగదేవత ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ములకలపల్లి గ్రామంలో నిర్వహించిన నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.