చెన్నూరులో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

చెన్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని చెన్నూర్-మంచిర్యాల జాతీయ రహదారిపై చేపట్టిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు ఆరోపించారు.

పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న పథకాలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా, రాస్తారోకోతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.