కల్యాణలక్ష్మి.. షాదీ ముబారక్‌ను కొనసాగించాలి

ఎన్నికల హామీల మేరకు తులం బంగారం ఇవ్వాలి
హామీలు అమలు చేయకుండా మాటలతో తప్పించుకోలేరు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి
అంబేద్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు.

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లపాటు అమలు చేసిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కోర్టుల్లో సరైన వాదనలు వినిపించకపోవడంతో పథకంపై ఆంక్షలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

— రూ.2,500 హామీ ఏమైంది?
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని గండ్ర డిమాండ్‌ చేశారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం, రైతు బీమా వంటి హామీలను కూడా అమలు చేయాలన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు.

— హామీలు అమలు చేయండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయం కేటాయించకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని గండ్ర సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులకు సాగునీరు, ఎరువులు అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మాటలతో, ఎదురుదాడులతో ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోలేదని గండ్ర హెచ్చరించారు. ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరగా పాలన సాగిస్తూ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.