జర్నలిస్టుపై దాడి దుర్మార్గం
భూపాలపల్లిలో రవితేజ కుటుంబంపై దాడి..
ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం
కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి:
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జర్నలిస్టు రవితేజపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. రవితేజపై దాడి చేయడంతో పాటు ఆయన భార్యపై దాడి చేయడం, ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలను ధ్వంసం చేయడం, కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను పరామర్శించిన అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
జర్నలిస్టుపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
విధి నిర్వహణలో భాగంగా భూ వివాదానికి సంబంధించిన కథనాలను ప్రసారం చేసినందుకే రవితేజను లక్ష్యంగా చేసుకున్నారని గండ్ర ఆరోపించారు. రాత్రి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టి లేపి దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టులపై దాడులను కేవలం వ్యక్తిగత దాడులుగా చూడకూడదని, అవి ప్రజాస్వామ్యంపై దాడులుగా పరిగణించాలని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన మరుసటి రోజే జర్నలిస్టుపై ఇలాంటి దాడి జరగడం దురదృష్టకరమని గండ్ర వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాలి
రవితేజ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. పోలీసులు ఈ ఘటనపై ప్రేక్షక పాత్ర పోషించకుండా, ఫిర్యాదులోని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధికార పార్టీ అండ ఉందనే ధీమాతోనేనా?
అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ధీమాతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గండ్ర ఆరోపించారు. చిట్యాల మండలంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నియంతృత్వ ధోరణి కనిపిస్తోందని అన్నారు. గతంలోనూ జర్నలిస్టులను బెదిరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి
దాడి ఘటనలో రవితేజ కుటుంబానికి చెందిన గృహోపకరణాలు, ఫర్నిచర్ ధ్వంసమైనందున బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని గండ్ర డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ జర్నలిజం వృత్తిని కొనసాగిస్తున్న రవితేజకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తన వంతుగా రవితేజ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇతరులు కూడా బాధిత కుటుంబానికి తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
