Jammu Kashmir | నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
Jammu Kashmir | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దచ్చన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
హర్యానాకు చెందిన ప్రయాణికులు డాంగ్‌దారు నుంచి సౌందర్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి లోయలోకి జారిపడి నదిలో పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నదిలో పడిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కొండ మార్గాల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాలకు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
