స్వాతంత్ర్య వేడుకల్లో అపశృతి.. ప్రసంగిస్తూ కళ్లుతిరిగి కిందపడిపోయిన మంత్రి ఆనం
తిరుపతి సిటీ బ్యూరో (ఆంధ్రప్రభ): తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేడుకల్లో సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. మంత్రి ఒక్కసారిగా కిందపడిపోవడంతో అక్కడున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. అవసరమైన వైద్య సేవలు అందించేందుకు పోలీసులు ముందస్తుగా అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.
